Minister Ponnam Prabhakar : గత పదేళ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలిచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే విదేశీ విద్యానిధి ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందని వివరించారు.
ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడంతో పాటు నిర్వాసితుల పిల్లల విద్యకు చర్యలు తీసుకుంటామని, బీసీ సంక్షేమ శాఖ, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన చేపడతామని మంత్రి తెలిపారు.