Kodikathi Srinu : కోడికత్తి శ్రీను ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. విశాఖ జైల్లో అసలేం జరుగుతోంది?
Kodikathi Srinu : కోడికత్తి కేసు నిందితుడు శ్రీనిసవాసరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? విశాఖ పట్టణం జైల్లో అసలేం జరుగుతోంది? అనే అనుమానాలు జనాల్లో తలెత్తుతున్నాయి. కోడికత్తి కేసులో జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ఐదేళ్లుగా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ‘సీఎం జగన్ కోర్టులో సాక్ష్యం చెప్పాలి..లేదా ఎన్ వోసీ ఇచ్చి న్యాయం చేయాలి’’ అంటూ శ్రీనివాసరావు ఈనెల 18నుంచి జైల్లో నిరాహార దీక్షకు దిగారు. ఈ విషయాన్ని ములాఖత్ లో అతడిని కలిసిన దళిత సంఘాల నేతలకు తెలియజేశారు. అయితే దీక్ష విషయంలో జైలు అధికారుల ప్రకటనలతో గందరగోళం నెలకొంది. నిందితుడు శ్రీనివాస రావు ఆహారం తీసుకుంటున్నారని అధికారులు చెబుతుండడంతో అసలు విశాఖ సెంట్రల్ జైలులో ఏం జరుగుతోందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
దీక్ష వ్యవహారాన్ని మొదట్లో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. జైలు వద్ద దళిత సంఘాల నేతలు ఫ్లకార్డులు ప్రదర్శించడం, ములాఖత్ కోరడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తర్వాత అంతా కట్టుదిట్టం చేశారు. వారితో శ్రీనివాసరావు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ఓ అధికారి అక్కడే ఉన్నట్లు సమాచారం. దళిత నేతలు వచ్చిన కొద్దిసేపటికే శ్రీనివాసరావు జైల్లో దీక్ష చేయడం లేదని ప్రకటించడం చర్చనీయాంశమైంది.
జైల్లో శ్రీనివాసరావు నిరాహార దీక్షలో ఉన్నారా? అధికారులు అడ్డుకుంటున్నారా? అనే నిజం తెలుసుకునేందుకు విశాఖ దళిత సంఘాల(విదసం) ఐక్య వేదిక నాయకులు శనివారం మరోసారి ములాఖత్ కోరారు. దాదాపు మూడు గంటల తర్వాత పర్మిషన్ లేదంటూ వారిని బయటకు పంపించివేశారు. ఖైదీని బంధుమిత్రులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉన్నా అధికారులు అనుమతినివ్వలేదని విదసం కన్వీనర్ బూసి వెంకట్రావు ఆరోపించారు. శ్రీను తరఫున ములాఖత్ అయ్యే బంధుమిత్రుల జాబితాలో తన పేరు ఒక్కటే విశాఖ నుంచి ఉందని, శ్రీను కుటుంబ సభ్యులు దీక్షలో ఉండడంతో వచ్చే అవకాశం లేదని, మరి రెండో ములాఖత్ ఎవరికి ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు.
అయితే ఈ వివాదంపై జైలు పర్యవేక్షణాధికారి ఎస్.కిషోర్ కుమార్ ను సంప్రదిస్తే ‘శ్రీను మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే బిస్కెట్లు తీసుకుంటున్నట్లు తోటి ఖైదీలు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. రోజూ డాక్టర్ పర్యవేక్షణ చేస్తున్నారు. దీక్షలో ఉన్నందున ములాఖత్ నిరాకరించాం’ అని చెప్పారు.