Bandi Sanjay : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్ధారించినప్పటికీ కేసీఆర్ కు ఇంతవరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని బండి సంజయ్ చేసిన ప్రకటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బండి సంజయ్ ఆషామాషీ ప్రకటన చేయలేదు. బండి సంజయ్ కన్ఫెషన్ రిపోర్టును ఆయన మీడియా ముందు పెట్టారు. ఆ రిపోర్టు చూస్తే రాధాకిషన్ రావు అఫ్రూవర్ గా మారిపోయారని అనుకుంటారు. అంత వివరంగా కేసీఆర్ గురించి.. కేసీఆర్ కోసం ఏం చేశామో చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ కేసులో తన పాత్రపైనా ఒప్పుకున్నారు.
ఈ కన్ఫెషన్ రిపోర్టును బయటపెట్టిన బండి సంజయ్..కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ట్యాపింగ్ కేసును మూలన పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానీ ఇక్కడ రేవంత్ పై ఆయన ఆరోపణలు చేయడం లేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ కనుసన్నల్లో ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతుంటే మంత్రి ఎలా వీక్ చేస్తారనేది బండి సంజయ్ కే తెలియాలి. పైగా ట్యాపింగ్ బాధితుల్లో మొదట రేవంత్ అయితే..తర్వాత తానేనని అంటున్నారు.
బండి సంజయ్ వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ ను ట్యాపింగ్ కేసులో కాపాడేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారి ప్రయత్నాలను నిర్వీర్యం చేసేందుకు బండి సంజయ్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇందుకు రేవంత్ వైపు నుంచి కూడా సహకారం అందుతోందని కీలక డాక్యుమెంట్లను పబ్లిక్ లో పెట్టడం ద్వారా కేసీఆర్ ను తప్పించే ప్రయత్నాలన్నింటికీ చెక్ పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ట్యాపింగ్ కేసులో ఎన్నికల తర్వాత సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.