Actual results : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నేటి సాయంత్రంతో ముగియనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశలో.. 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 7 దశల ఎన్నికల్లో నేటితో చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ సారి ఎన్నికల పోరు రసవత్తరంగా సాగడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చాలా మందికి జూన్ 4 దాక వెయిట్ చేయాలంటే కష్టంగా ఉంది. ఓటర్ల ఎటు మొగ్గుచూపారో..ఏ పార్టీ అధికారంలో రాబోతుందో..తమ సర్వేల ద్వారా అంచనా వేసిన పలు మీడియా సంస్థలు, వివిధ సర్వే సంస్థలు తమ నివేదికలను వెల్లడించనున్నాయి.
ఇవాళ సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ సరళి, ఓటు వేసిన తర్వాత ఓటర్ల అభిప్రాయాలు, పలు విశ్లేషణలు ద్వారా సమాచారాన్ని సేకరించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసి ఫలితాలు విడుదల చేస్తారు. అయితే ఇవి ఒక్కొక్కసారి నిజం కావొచ్చు..ఒక్కొక్క సారి అసలు ఫలితానికి దగ్గరగా ఉండొచ్చు.. లేదా మొత్తానికి వ్యతిరేకంగానూ ఉండొచ్చు. అయితే ప్రామాణిక శాంపిల్స్ ద్వారా సమాచారాన్ని సేకరించిన సర్వే ఫలితాలు దాదాపు అసలు ఫలితాలకు దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి.
కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ఎన్నికల సంఘం వెల్లడించిన నిజమైన ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి యూపీఏ
ఇండియాటుడే-యాక్సిస్ మైఇండియా 339-365 77-108
న్యూస్ 24-టుడేస్ చాణక్య 350+- 95+
న్యూస్ 18-ఐపీఎస్వోస్ 336 82
టైమ్స్ నౌ-వీఎంఆర్ 306 132
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ 300+ 120+
సీవోటర్ 287 128
ఇండియా న్యూస్-పోల్ స్ట్రాట్ 287 128
ఏబీపీ-సీఎస్డీఎస్ 277 130
అయితే ఎగ్జిట్ పోల్స్ పైవిధంగా ఉండగా..ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి 353 సీట్లు సాధించగా అందులో బీజేపీ 303 స్థానాల్లో గెలిచింది. యూపీఏకు 91 సీట్లు సాధించగా అందులో కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితమైంది. అయితే 2019 ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్నీ కూడా ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అసలు ఫలితాలు కూడా దాదాపు అవే వచ్చాయి. కొన్ని సీట్లు అటుఇటు మాత్రమే అయ్యాయి తప్పా..ఎగ్జిట్ పోల్స్, యాక్చువల్ రిజల్ట్స్ ఒకేలా ఉండడం గమనార్హం. అయితే ఈ సారి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో..ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తాయో మరికొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. అప్పటిదాక ఉత్కంఠను భరించాల్సిందే.