Weather Report : వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్ నెలలో తీవ్ర వడగాలులకు తోడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కొద్ది రోజులుగా వాతావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే వర్షాలు కురుస్తాయని అందరూ భావించారు. కానీ ‘రెమాల్’ తుపాను ఉత్తర దిశగా బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోయింది. దీంతో కాకినాడ, విజయవాడ నగరాల్లో వర్షాలు పడినా విశాఖలో మాత్రం చినుకు పడలేదు.
తుపాను ప్రభావంతో పొడి వాతావరణం నెలకొని, వేడి, ఉక్కపోత పెరిగాయి. నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని, వడగాలులు తీవ్ర రూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సోమవారం నుంచి జూన్ 3 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
సముద్ర తీరానికి సమీపంలో ఉన్న జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం అనకాపల్లి జిల్లాలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వడగాలులు వీచే అవకాశముంది. మంగళవారం విశాఖ ఉమ్మడి జిల్లాలోని 43 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.