JD Lakshmi narayana:సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా నిలవాలనుకుంటున్నారు. గత కొంత కాలంగా ఆయన పేరు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంది. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని ప్రకటించిన ఆయన పవన్ కల్యాణ్‌కు ఆకర్షితుడై జనసేన పార్టీలో చేరడం, అక్కడి పద్దతులు నచ్చక బయటికి రావడం తెలిసిందే. జనసేన నుంచి బయటికి వచ్చాక ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది.
కానీ ఆయన బీజేపీలో చేరలేదు. ఆ తరువాత అధికార వైసీపీ ఆయనకు ఆఫర్లు ఇచ్చిందని కూడా ప్రచారం జరిగింది. ఫైనల్‌గా ఆయన ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేస్తూ `జై భారత్ నేషనల్ పార్టీ`ని ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం వంటి ఆకాంక్షలు, ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ ఇదని వెల్లడించారు. ఐపీఎస్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రజాసేవ కోసం వచ్చానన్నారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసి మూడు లక్షల మంది ఓటర్ల మద్దతు సంపాదించానన్నారు. అయితే జేడీ కొత్త పార్టీపై రాజకీయ విశ్లేషకుల కామెంట్‌లు చేస్తున్నారు. ఉద్యోగం వేరు, రాజకీయాలు వేరు అన్నది ఆయన గుర్తించడం లేదని చెబుతున్నారు. రాజకీయాల్లో ఆయన లాంటి వాళ్లు నెగ్గుకు రావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు. ఎంత మంచి నాయకుడైనా ప్రజలను ఆకర్షించి వారిని తమవైపు తిప్పుకునే మాయ ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారని, అలాంటి మాయలు, మాయ మాటలు జేడీ వల్ల కాదన్నారు.
ఇలా ప్రజలకు సేవ చేయాలని వచ్చిన ఎంతో మంది మధ్యలోనే అస్త్ర సన్యాసం తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. లోక్ సత్తా పార్టీని స్థాపించి సమ సమాజ స్థాపన కోసం, నీతివంతమైన రాజకీయాల కోసం అంటూ జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. అయితే ఆయన ఎంత నీతివంతమైన పాలనను ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చినా ఆయన ప్రజలని ఏ మాత్రం ఆకర్ఫించలేకపోయారు. ఇదే తరహాలో జేడీ కూడా మిగిలిపోతారని, రాజకీయ క్రీడలో రాణించడం అనుకున్నంత ఈజీ కాదని, పార్టీ పెట్టడం వరకు ఓకే కానీ దాన్ని నడిపించడం, అభ్యర్థులని నిర్ణయించడం, ప్రజల మన్ననలు అందుకోవడంలోనే అసలు పరీక్ష ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ బడుగులకు రాజ్యాధికారం అనే నినాదంలో పార్టీని స్థాపించి ఇప్పటికీ ఓ స్థిరమైన పార్టీగా పేరు తెచ్చుకోలేకపోతున్న విషయం తెలిసిందే. టీడీపీకి సపోర్ట్‌గా నిలుస్తూ వస్తున్నారే కానీ తమ ఉనికిని మాత్రం చాటుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఒక్కరంటే ఒక్కరు గెలిస్తే వారు కూడా వైసీపీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇక పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జేడీ రాజకీయంగా నలబడటం కష్టమని, ఆయన మరో జేపీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.