Namburu Sankar Rao : ‘నంబూరు’ చరిత్ర : హామీలు మరిచి ప్రజలను ముంచి..
Namburu Sankar Rao : ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ,జనసేన, బీజేపీ జట్టు కట్టడంతో వైసీపీ ఓటమి దాదాపు ఖరారైనట్టే అని జనాల నాడిని బట్టి తెలుస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అందరి కళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడుపై పడింది. టీడీపీ కూటమి నుంచి భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు శంకరరావు బరిలో ఉన్నారు. వీరిద్దరూ సమీప బంధువులు కావడం విశేషం. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ప్రత్యర్థులుగా పోటీ చేయడం.. ఓట్ల చీలిక కలిసొచ్చి.. పెదకూరపాడు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి నంబూరు శంకరరావు గెలిచారు. అయితే ఈసారి భాష్యం ప్రవీణ్ ను పోటీలోకి దించడంతో నియోజకవర్గ రాజకీయం మారిపోయింది.
నంబూరుపై తీవ్ర వ్యతిరేకత..
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో టీడీపీ కూటమికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పెదకూరపాడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని, ఆయన అవినీతి పనులు, ఇసుక, మైనింగ్ దోపిడీ వంటి వాటిపై కూడా స్థానిక ఓటర్లు గుర్రుగా ఉన్నారు. మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే తమ కంటితో తామే పొడుచుకున్నవారమవుతామని స్థానికులు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నంబూరుకు ఓటేసే అవకాశం లేదని అంటున్నారు.
ఎస్ ట్యాక్స్ కట్టాల్సిందే..
పెదకూరపాడులో ఎస్ ట్యాక్స్ అనే విమర్శలు ప్రకంపనలు రేపుతున్నాయి. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ఎస్ ట్యాక్స్ విరివిగా ప్రచారంలోకి వస్తుంది. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఎస్ ట్యాక్స్ పై గతంలో వైసీపీ ఎమ్మెల్యే నంబూరును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెదకూరపాడులో ఇసుక రీచ్ లు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఎస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఒక్క హామీ నెరవేర్చలేదు..
నంబూరు శంకరరావు ఎమ్మెల్యేగా ఒక్క హామీ నెరవేర్చలేదని స్థానికులే చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కన్నా ఆయన అక్రమ సంపాదనకే ఎక్కువ సమయం కేటాయించారని అంటున్నారు. ఆయన చేయని దందా లేదని, ఎమ్మెల్యేగా ఆయన అన్నింటా విఫలమయ్యారని చెప్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజల కోసం ఆయన చేసినా ఒక్క పని లేదన్నారు. ఎన్నికల వేళ హామీలన్నీ తుంగలో తొక్కి ప్రజలను నిండా ముంచారని అంటున్నారు.
నంబూరు ఆగడాలు భరించలేం..
వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలను భరించే స్థితిలో జనం లేరని, పెదకూరపాడులో ఇది మరింత ఉందని, అందుకే నంబూరును ఇంటికి పంపించేందుకు నియోజకవర్గ ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. టీడీపీ గెలిచే సీట్లలో పెదకూరపాడులో భారీ మెజార్టీ నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రవీణ్ టీడీపీ అభ్యర్థి కావడంతో నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయినట్టు చెపుతున్నారు.