High Court : సాయిరెడ్డి కుమార్తెపై చర్యలకు హైకోర్టు ఆదేశం

High Court

High Court

High Court Order : ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తెలుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తన పార్టీ కీలక నేతలు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడ్డారు. ఈ విషయంపై వైసీపీ హయాంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. అయినా వారి ప్రభుత్వం కావడంతో అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో వైసీపీ అన్యాయాలు అన్నింటికీ బయటకు తీస్తున్నారు. ఇందులో భాగంగా సాయిరెడ్డి కుమార్తెకు సంబంధించి ఆస్తులపై హై కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డితో పాటు ఇతరులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారా..? అని ప్రశ్నించిన కోర్టు సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

సముద్రానికి దగ్గరగా ఉన్న భీమిలి బీచ్ సీఆర్జెడ్-1 ప్రాంతంలో శాశ్వత అక్రమ నిర్మాణాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ జనసేన కార్పొరేటర్ పీఎల్వీఎన్ మూర్తి యాదవ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసుపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు తీరానికి సమీపంలో నిర్మిస్తున్న శాశ్వత నిర్మాణాలను తొలగించాలని జీవీఎంసీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బుధవారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. తీరప్రాంత భద్రతా గోడను మాత్రమే కూల్చివేశారని, ఇతర అక్రమ నిర్మాణాలు చెక్కుచెదరలేదని కోర్టుకు నివేదించారు. పర్యావరణ చట్టం ప్రకారం.. అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి శిక్షపడే అవకాశం ఉంది. దీనిపై జీవీఎంసీ తరఫు ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి స్పందిస్తూ కోర్టు ఆదేశాలతో సీఆర్జెడ్ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేశామన్నారు.

TAGS