JAISW News Telugu

KTR : కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు.. విచారణ నాలుగు వారాలకు వాయిదా

FacebookXLinkedinWhatsapp
KTR

KTR

KTR : తెలంగాణలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు కేటీఆర్ తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, సిరిసిల్ల ఆర్వోలకు నోటీసులు జారీ చేసింది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన కొడుకు కె.హిమాన్షు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. తనపై భార్య, మైనర్ కుమార్తె మాత్రమే ఆధారపడ్డారని అఫిడవిట్ లో కేటీఆర్ పేర్కొన్నారని, గత ఏడాది జులైలో మేజర్ అయిన హిమాన్షు తనపై ఆధారపడలేదని తెలిపారన్నారు. అయితే, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వెంకటాపూర్ లో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసినందుకు హిమాన్షు వరుసగా రూ.10.50 లక్షలు, రూ.88.15 లక్షలు చెల్లించాడని, గత ఏడాదే మేజర్ అయిన అతడికి కేటీఆర్ ఆర్థిక సాయం లేకుండా అంత డబ్బు ఎలా వస్తుందని పేర్కొన్నారు. అఫిడవిట్ లో నిజాలు దాచిన కేటీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. వాదనల అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

Exit mobile version