Jagan : ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్, పలువురు మంత్రులు, అధికారులు సహా మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణ డిసెంబర్ 14కి వాయిదా పడింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, సీబీఐ విచారణకు ఆదేశించాలని రఘు రామ కృష్ణంరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదిస్తూ, ఈ పిటిషన్ వ్యక్తిగత ఉద్దేశ్యంతో దాఖలైందని, ఇందులో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదని, ఇది విచారణకు అనర్హమైనదని వాదించారు. పిటిషనర్ వాదనలు ప్రజా సంక్షేమంపై నిజమైన శ్రద్ధ కంటే వ్యక్తి గత ఉద్దేశ్యాలే అధికంగా కనిపిస్తున్నాయని కోర్టుకు విన్నవించారు. పిటిషన్ అసందర్భమన్నది ప్రభుత్వ వైఖరి.
దీనికి విరుద్ధంగా, పిటిషన్ దాఖలు చేసిన తరువాత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు వారి దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నాడు. ఇప్పుడు సీఎం జగన్ పై రఘు రామ కృష్ణంరాజు పిటిషన్ ను విచారణకు కోర్టు స్వీకరించడంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జగన్ ప్రభుత్వంలో కోరికలు నెరవేరడం కంటే కోర్టుల చుట్టూ ప్రభుత్వం, ప్రతిపక్షం చక్కర్లు కొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.