Hero Surya : తన కెరీర్ లో ఎన్నో ఎత్తు పళ్లాలను చూసిన సూర్య సౌమ్యుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నాడు. తమిళ నటుడిగా ఎదుగుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లోకి వెళ్లలేదు. తన కెరీర్ జర్నీ గురించి ఆయన మాట్లాడుతూ ‘ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఫెయిల్యూర్స్ ను అనుభవించినప్పుడే విజయం కిక్కును ఇస్తుంది’ అని అన్నారు.
విమర్శలను ఎదుర్కోవడంలో తన విధానాన్ని ఎలా మార్చుకున్నాడో వివరిస్తూ, ‘ఐదారేళ్ల క్రితం, విక్రమ్ లోని నా పాత్ర రోలెక్స్ మాదిరిగానే నేను తీవ్రమైన కోపంతో ప్రతిస్పందించేవాడిని. నెగిటివ్ ట్వీట్ లేదా కామెంట్ చేస్తే నాకు విపరీతమైన కోపం వచ్చేది. కానీ క్షమాగుణం ఒక అందమైన ఆభరణం.’
నెగిటివిటీకి ఉత్తమ ప్రతిస్పందన ప్రేమను వ్యాప్తి చేయడమే అని సూర్య నొక్కి చెప్పారు. ‘ఇతరులు ఏం చెప్పినా, మనం సానుకూలతను మాత్రమే పంచుకోవాలి. ప్రతి నెగిటివ్ కామెంట్ కు రియాక్ట్ అవ్వడం విలువైన సమయాన్ని వృథా చేయడమే’ అంటారు. తన దృక్పథాన్ని పునర్నిర్మించడంలో ‘కంగువ’ దర్శకుడు శివ తనకు సహాయపడ్డాడని, జీవితంపై శివ యొక్క విధానం తనకు స్ఫూర్తినిచ్చిందని సూర్య పేర్కొన్నాడు.
ఒక ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ, భారతీయ సినిమా బ్రేవ్ హార్ట్ లేదా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి ఎపిక్ చిత్రాలను రూపొందించాలని తన చిరకాల కోరికను వ్యక్తం చేశారు. బ్రేవ్ హార్ట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అపోకలిప్టో వంటి సినిమాలను మేమంతా చాలా సార్లు చూశాం. ఇలాంటి కథలను ఇండియాలో ఎప్పుడు చూస్తామో అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నాను.
ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో సూర్య మాట్లాడుతూ.. కంగువ కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని అన్నారు. ‘ఇది కత్తులు, యుద్ధాల గురించి చెప్పేది మాత్రమే కాదు.. లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. 5 ద్వీపాల మధ్య సంఘర్షణ వెనుక కారణం ప్రత్యేకమైన కథ. క్షమాగుణం అనేది కథ హృదయంలో ఉంది ఇది ప్రేమ యొక్క స్వచ్ఛమైన రూపం.’ అన్నారు. బాబీ డియోల్, దిశా పటానీలతో పాటు సూర్య ద్విపాత్రాభినయం చేసిన కంగువా నవంబర్ 14న విడుదల కానుంది.