Japan : జపాన్ లో భారీ హిమపాతం.. కొనఊపిరితో పోరాడుతున్న ఆర్కాస్ మూగజీవులు.. చేతులెత్తేసిన అధికారులు..

Orcas are fighting for breath..

Orcas are fighting for breath..

Japan Killer Whales : ప్రకృతిని ఎదిరించి బతకడం జీవకోటికి కష్టమే. మానవుడు సాంకేతికంగా ఎన్ని అద్భుత విజయాలు సాధించినా ప్రకృతికి విరుద్ధంగా మాత్రం ఏ పనిచేయలేడు. తుఫాన్లు, భూకంపాలు, హిమపాతాలు, కార్చిచ్చు..ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో ఉత్పాతాలు మనిషికి సవాల్ విసురుతున్నాయి. ఇక మనుషుల పరిస్థితే ఇలా ఉంటే పాపం మూగజీవుల పరిస్థితి ఏంటి? వాటిని అవి ఎలా రక్షించుకోగలుగుతాయి?

ద్వీపదేశం జపాన్ లో ఇటీవల మొదలైన భారీ హిమపాతం అరుదైన కిల్లర్ వేల్స్ (ఆర్కాస్)కు ప్రాణాంతకంగా మారింది. ఉత్తర జపాన్ లోని హక్కైడో తీరంలోని రౌస్ అనే ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్ వేల్స్ చిక్కుకుపోయాయి. ఇవి కదలడానికి చోటు లేకపోవడంతో.. తలలు నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను జపాన్ కు చెందిన జాతీయ టెలివిజన్ చానల్ ప్రసారం చేసింది. ఆ మూగజీవాలు గాలి ఆడక అవస్థ పడుతున్న తీరు జంతుప్రేమికులను ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన విషయం తెలిసిందే. కిల్లిర్ వేల్స్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏటా రౌస్ వద్దకు భారీ సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు.

తొలుత ఈ వేల్స్ ఇబ్బందులు పడడం చూసిన కొందరు మత్స్యకారులు అధికారులను అలర్ట్ చేశారు. అయితే ఆర్కాస్ ను రక్షించేందుకు అక్కడకు చేరుకోవడం కోస్ట్ గార్డ్ కు సవాల్ గా మారింది. అక్కడి నీరు మొత్తం మందపాటి మంచుఫలకంగా మారిపోయింది. మంచు కరిగి ఆ ఫలకం విరిగిపోయే వరకు తాము ఏమిచేయలేమని అధికారులు చేతులు ఎత్తేశారు. శీతాకాల ఎఫెక్ట్ తో జపాన్ ఉత్తర తీరాన్ని మంచు దుప్పటి కప్పేసింది.

2005లో కూడా ఇలానే మంచులో ఆర్కాస్ చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాయి. ఆ ఘటన కూడా రౌస్ సమీపంలోనే జరిగింది. ఉత్తరార్థ గోళంలో లోతట్టు ప్రాంతంగా హక్కైడోను భావిస్తుంటారు. గతంలో ఇక్కడ భారీగా మంచు గడ్డకట్టి ఉండేదని సైంటిస్టులు చెప్తున్నారు.

TAGS