Heavy Rains : భానుడు భగభగమనే మే నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. పొలాలు, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోతోంది. ఇక పిడుగులు పడి పలువురు మృతిచెందారు. అయితే ఈ వర్షాలు నేడు, రేపటి లోగా తగ్గే అవకాశాలు కనపడడం లేదు. ఈ నెల 23 వరకూ తెలంగాణ, ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రేపటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతీ రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
కాగా, ఇవాళ పలుచోట్ల వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. హైటెక్ సిటీ, బీహెచ్ ఈఎల్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఇప్పటికే హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయమైన విషయం తెలిసిందే. నగరాల పరిస్థితి ఇలా ఉంటే పల్లెల్లో పంటలు అకాల వర్షానికి తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.