Heavy Rains : భారీ వర్షాలు.. రోడ్డుపై వింత చేపలు
Heavy Rains : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. అయితే, వర్షపు వరదలో కొట్టుకు వచ్చిన రెండు వింత చేపలు రోడ్డుపైన పాకుతూ మహబూబ్ నగర్ జిల్లా పెంట్లవెల్లి మండలంలో కనిపించాయి. పెంట్లవెల్లి నుంచి మంచాలకట్ట వెళ్లే దారిలో ఈ చేపలు కనిపించాయి. దీంతో ఈ చేపలను చూడటానికి ప్రజలు, రైతులు గుంపులుగా వచ్చారు.
చేపలు రోడ్డుపై పాకుతూ పోవడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్పను వివరన కోరగా, ఈ చేప నదులు, చెరువులు, కుంటలు, వాగుల్లో జీవిస్తుందని తెలిపారు. ఈ చేపను గురక చేప (ఎక్కే చేప) అని, శాస్గ్రీయ నామం అనబాస్ టెస్టుడ్యూనియస్, సుమారు 25 సెంటిమీటర్ల వరకు పెరుగుతుందన్నారు. ఇది తన తలకు ఇరువైపులా ఉన్న మొప్ప కుహరంపై ఉన్న రంపపు వంటి పండ్ల ద్వారా నేలపై పాకుతుందని, చెట్లను కూడా ఎక్కుతుందని చెప్పారు. చేపల పెంపకందారులు ఆంధ్ర ప్రాంతంలో ఆహారపు చేపగా చెరువుల్లో ప్రత్యేకంగా పెంచుతారని వివరించారు.