Uttarakhand : ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని బద్రినాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శనివారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఉత్తరాఖండ్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.