Delhi : ఢిల్లీలో భారీ వర్షాలు.. జూన్ లోనే అత్యధిక వర్షపాతం
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శుక్రవారం మూడు గంటల వ్యవధిలోనే ఢిల్లీలో 150 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228.1 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారని పేర్కొంది. 1936 జూన్ 28న సఫ్దర్ జంగ్ అబ్జర్వేటరీలో 24 గంటల వ్యవధిలో 235.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.
భారీ వర్షం కారణంగా ఢిల్లీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అజాద్ మార్కెట్ అండర్ పాస్ వద్ద పలు లారీలు నీట మునిగాయి. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.