Tirumala News : తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. బుధవారం (అక్టోబరు 16) రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వినాయక స్వామి గుడి తర్వాత రెండవ మలుపు దగ్గర రోడ్డుపై బండరాళ్లు పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన బండరాళ్లను తొలగిస్తున్నారు.
కొండచరియలు విరిగిపడడంతో ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో వారం రోజులుగా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు వాయుగుండం ప్రభావంతో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. భారీ వర్షంతో నిన్న (అక్టోబరు 15) బ్రేక్ దర్శనాలు సైతం రద్దు చేశారు. ఆగకుండా పడుతున్న వర్షంతో తిరుమల కొండపై భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.