Hyderabad : హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. సాయంత్రం 5.30 గంటలకు మొదలైన వర్షం ఒక్కసారిగా ఉధృతంగా మారింది. భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు నగరజీవులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పడప్పుడే అఫీసుల నుంచి బయటకు వస్తోన్న ఉద్యోగులు గాలివానకు అల్లాడిపోయారు. నాన్ స్టాప్ గా పడుతున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపై ఆగిపోయాయి.
మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.