Telangana Rains : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్ర లోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీంతో తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పగటిపూట ఎండలు ఉన్నప్పటికీ రాత్రి వేళ వానలు పడతాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇటీవల రాష్ట్రంలో ఎండలు బాగా తగ్గిపోయాయి. ఏప్రిల్ లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో కూడా భారీగా ఎండలు ఉండగా, ఇటీవల పడిన వర్షాలతో వాతావరణం కొంత చల్లబడింది.