High Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు విచారణ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్ పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేయనుంది.
కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటీషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై జులై 3న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను నేటికి (సోమవారం) వాయిదా వేసింది.