T20 World Cup 2024 : ఈ ఏడాది జరుగనున్న టీ 20 వరల్డ్ కప్ కు భారత కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై కొంతకాలంగా సందిగ్ధత ఉన్న విషయం తెలిసిందే. చాలా ఊహగానాలే వినిపించాయి. ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు బీసీసీఐ కార్యదర్శి జై షా.
ఈ వరల్డ్ కప్ వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరుగనుంది. ఇప్పటికే ఐసీసీ పూర్తి షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. దాదాపు 11 ఏండ్లుగా ఈ టైటిల్ కోసం భారత్ ఎదురుచూస్తోంది. ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలన్న కసితో ఉంది. గతేడాది వరల్డ్ కప్ ఫైనల్, టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్, అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరి మరి ఆ కప్ లను కోల్పోయింది. ఇక పొట్టి కప్ నైనా అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది.
ఈక్రమంలో టీమిండియా కెప్టెన్ గా ఎవరు ఉంటారన్న సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లో ఎవరు కెప్టెన్ గా ఉంటారు..? అనేదానిపై స్పష్టత రాలేదు. 2022లో జరిగిన టీ -20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడు. వన్డేలు, టెస్ట్ లకే పరిమితం కాగా.. టీ 20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తూ వచ్చాడు. అయితే ఈ ఏడాది జనవరిలో అఫ్గానిస్తాన్ తో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి వచ్చాడు. దీంతో టీ-20 వరల్డ్ కప్ లో భారత కెప్టెన్ ఎవరు అనే సందేహాలు బయలుదేరాయి.
తాజాగా టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉంటారని జై షా స్పష్టం చేశారు. అతడి సారథ్యంలోనే ప్రపంచ కప్ టైటిల్ ను భారత్ కైవసం చేసుకుంటుందన్న పూర్తి నమ్మకం తమకు ఉందని రాజ్ కోట్ లో బుధవారం జరిగిన ఓ ఈవెంట్ లో చెప్పారు.
‘‘వరల్డ్ కప్ గురించి నేను ఏదైనా చెబుతానని అందరూ ఎదురుచూస్తున్నారు. 2023 వన్డే ప్రపంచకప్ లో 10 మ్యాచ్ లు గెలిచినా మనం టైటిల్ దక్కించుకోలేకపోయాం. అయితే అభిమానుల హృదయాలను గెలుచుకున్నాం. అందరికీ నేను ఓ ప్రామిస్ చేయాలనుకుంటున్నా.. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో 2024లో మనం భారత్ జెండాను రెపరెపలాడిస్తాం’’ అని జై షా చెప్పుకొచ్చారు.