JAISW News Telugu

Sir Arthur Cotton : తరాలు మారిన ‘గోదావరి’ గుండెల్లో చిరంజీవి.. కాటన్ దొర

Sir Arthur Cotton

Sir Arthur Cotton

Sir Arthur Cotton : కరువు తీరేంత నీరు కళ్ల ముందే సముద్రంలో వృధాగా కలిసి పోతుంటే.. మూడు పంటలు పండే సారవంతమైన భూమి ఉండి కూడా.. ఏం చేయలేని స్థితిలో ఉన్న ఉభయ గోదావరి జనాల జీవితాల్లో  వెలుగులు నింపారు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌. గోదావరివాసుల దుర్బర జీవితాల్ని కళ్లారా చూశారు.. బ్రిటిష్‌ అధికారులు. ఆనకట్ట కట్టేందుకు అనుకూల పరిస్థితులను అంచనా వేసేందుకు సర్ ఆర్ధర్ కాటన్‌ అనే వ్యక్తి రాజమండ్రికి రావడం..  ధవళేశ్వరం, విజ్జేశ్వరం మధ్య బ్యారేజీ నిర్మాణానికి అనుకూలతలు బాగున్నాయని గమనించిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఒక బృహత్తర కార్యక్రమానికి 1847లో శ్రీకారం చుట్టారు.

తడారిన గొంతుకలను తియ్యటి నీటితో నింపి గోదావరి డెల్టా ప్రజలకు దైవం అయ్యారు కాటన్‌ దొర.. ఆయన పడిన కష్టం, నిస్వార్ధసేవ, అపారమైన మేధోశక్తి.. అంతకుమించి తనవారు కాకపోయిన ప్రజలకు మంచి చేయాలన్న తపన కాటన్‌ దొరను అపభగీరథుడిగా గోదావరి ప్రజల గుండెల్లో  దేవుడిని చేశాయి. ఆయన 1847లో ప్రారంభించిన ఆనకట్ట పనుల్లో వేలాది మంది కార్మికులు.. విదేశాల నుంచి తీసుకువచ్చిన యంత్రాలు, కలబోసి మొత్తం మీద 1852 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తిచేయగలిగారు.

చుట్టూ జీవజలాలున్నా వృథాగా పోతున్న నీటిని అడ్డుకట్టవేసే ఆనకట్ట నిర్మించడాన్ని భుజస్కందాలపై వేసుకున్న గొప్ప వ్యక్తి సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ దొర. ఈప్రాంతం అంతా గుర్రంపై తిరుగుతూ ఆకలి వేస్తే అక్కడ దొరికే అరటిపండ్లను తిని కడుపు నింపుకున్న కార్యదీక్షకుడు అంటుంటారు ఆయనను.  ధవళేశ్వరం బ్యారేజ్‌ నిర్మాణం అనంతరం వశిష్ట నదికి అవతల ఉన్న వేలాది ఎకరాలకు సాగు నీరందక నిరూపయోగంగా ఉండిపోతుందని గమనించారు. 1946 – 48 మధ్య కాలంలో అక్డిడెక్టు నిర్మాణం చేపట్టి వాటికి నీటిని మళ్లించగలిగారు.

ప్రధాన పంటకాలువల వ్యవస్థలు ఏర్పాటు చేసి తద్వారా పిల్లకాలువల వరకు సముద్ర తీర ప్రాంతాలకు సైతం సాగునీటిని మళ్లించిన మహానుభావుడు కాటన్‌ దొర.   ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పంట కాలువ వ్యవస్థ ఆయన దూర దృష్టి వల్లనే నీటి ఎద్దడి సమయంలోనూ సమర్ధవంతంగా సేవలందిస్తూ రైతుల్లో నేటికీ భరోసా నింపుతోంది.  గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా ఆయన గుర్రంపై స్వారీ చేస్తున్న నిలువెత్తు కాంశ్యవిగ్రహాలు అనేకం దర్శనమిస్తాయి.  ప్రతీ అన్నదాత ఇంట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలు కనిపిస్తుంటాయి..

Exit mobile version