Errabelli : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో టీడీపీలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనపై తీవ్ర ఒత్తిడి చేశారన్నారు. అందుకు ప్రతి ఫలంగా రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని తెలిపారు. డబ్బులతో పాటు మంత్రి పదవిని కూడా గాలం వేశారంటూ.. అయినా తాను పార్టీ మారలేదని చెప్పారు. పార్టీ మారలేదన్న కారణంతో వైఎస్సార్ తన పై పగ పెంచుకున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే వర్ధన్న పేట నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వేషన్ గా మార్చేశారని ఆరోపించారు.
అయితే.. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్ విభజనలో వర్ధన్న పేట నియోజకవర్గం మరోసారి జనరల్ కానుందని ఆయన చెప్పారు. ఆ నియోజకవర్గం దయాకర్ రావు అడ్డాగా పేర్కొన్న ఆయన జనరల్ కాగానే తాను అక్కడ నుంచి పోటీ చేసి కచ్చితంగా గెలుస్తానన్నారు. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసిన మహిళా అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకుంటూ ఓట్లు అభ్యర్థించారని.. అందుకే ఆమె గెలిచారని ఎద్దేవా చేశారు. లేకపోతే.. తనదే విజయమంటూ చెప్పుకొచ్చారు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఎర్రబెల్లి గుర్తు చేశారు.
కాగా, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మూడు సార్లే ఎమ్మెల్యే గెలిచిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ తన శిష్యుడే అయినా.. అతడికి ఎప్పుడూ నిలకడ లేదన్నారు. అందుకే చంద్రబాబును తిట్టారని చెప్పారు. తాను కూడా చంద్రబాబు వద్ద పనిచేశానని, కానీ ఎప్పుడు తిట్టలేదన్నారు. పార్టీలో సంబంధం ఎలా ఉన్నా.. నాయకులు నిజాయితీగా ఉండాలని సూచించారు. వచ్చే 10 నెలల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. చంద్రబాబును, కేసీఆర్‌ను మోసం చేసిన వారు చాలా మంది ఉన్నారని వరుసగా పేర్లు చెప్పడం గమనార్హం.