Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో మార్పు తేవాలనే ఉద్దేశంతో పదేళ్ల కింద పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకున్నా టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించడం కీలక పాత్ర పోషించారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క చాన్స్ ఇద్దామని ప్రజలు ఫిక్స్ కావడంతో జనసేన ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారు. అయినా కూడా పవన్ నిరాశకు లోనుకాకుండా తన రాజకీయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో సత్తాచాటడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు.
తన రాజకీయ ప్రవేశం గురించి తాజాగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం తన మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇష్టం లేదని చెప్పారు. ఒకనొక సమయంలో పార్టీని నడపడానికి తాను ఇబ్బంది పడుతున్నప్పుడు, డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నప్పుడు తన మిత్రుడు త్రివిక్రమ్ అండగా నిలిచాడని గుర్తు చేశారు. కష్టకాలంలో వెన్నంటి ఉన్న స్నేహితుడు త్రివిక్రమ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
నేను సమాజం కోసం ఆలోచించినప్పుడు నా కోసం ఆలోచించే వారు ఒకరు ఉండాలి కదా అంటూ పేర్కొన్న పవన్ తన కోసం త్రివిక్రమ్ ఎప్పుడూ ఆలోచిస్తాడని చెప్పుకొచ్చారు. తన కోసమే వకీల్ సాబ్ తో పాటు మరో మూడు నాలుగు సినిమాలు చేసినట్టు పవన్ తెలిపారు. త్రివిక్రమ్ కు తాను రాజకీయాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు.
టీనేజ్ లో ఉన్న సమయంలో నేను ఉద్యమంలోకి వెళ్లిపోవాలనుకున్నాను కానీ కుదరలేదు. సమాజంపై తనకు ఎంతో కోపం ఉండేదని, నా మనసులోని బాధను చూసిన తర్వాత త్రివిక్రమ్ జల్సాలో ఇంటర్వెల్ సీన్ రాశారని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చివరకు తాను రాజకీయాల్లోకి రాకుండా తన వంతుగా శతవిధాల ప్రయత్నం చేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత చేతులెత్తేసి.. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారన్నారు.