YS Sharmila : ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. వైసీపీ, టీడీపీ కూటమి ప్రచార రణరంగంలోకి ఇప్పటికే దూకగా కాంగ్రెస్ పార్టీ వరుస నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది. ఎన్డీఏ కూటమి వర్సెస్ వైసీపీగా మారిన పోరులో కాంగ్రెస్ కూటమి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. పీసీసీ చీఫ్ షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగేందుకు నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల జాబితా సిద్ధమవుతోంది. ఏపీలో సంక్షేమ ఓటు బ్యాంక్ పై గురి పెట్టిన కాంగ్రెస్ 9 గ్యారెంటీలను ప్రకటించింది. వామపక్షాలతో కలిసి కూటమిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్.. ఎవరి ఓటు బ్యాంకును గండి కొడుతుందో వేచి చూడాల్సి ఉంది.
పీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. కడప ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించారు. రేపు(సోమవారం) కాంగ్రెస్ ఏపీలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. ఈ త్రిముఖ పోరులో షర్మిల ప్రభావం కీలకంగా మారనుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన గ్యారెంటీలను ఇక్కడ అమలు చేయనున్నట్లు షర్మిల తెలిపారు. అవి ఇలా ఉన్నాయి.
తొలి గ్యారెంటీ:
రాష్ట్రానికి 10ఏండ్లు ప్రత్యేక హోదా. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు.
రెండో గ్యారెంటీ:
మహిళా మహాలక్ష్మి: ప్రతీ పేద మహిళకు ప్రతీ నెల రూ. 8,500 నగదు. ఏడాదికి లక్ష రూపాయలు అవుతుంది.
మూడో గ్యారెంటీ:
రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ.
నాలుగో గ్యారెంటీ:
పెట్టుబడి మీద 50శాతం లాభంతో కొత్త మద్దతు ధర.
ఐదో గ్యారెంటీ:
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం రూ.400 చేస్తామని పార్టీ హామీగా ప్రకటించింది.
ఆరో గ్యారెంటీ:
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.
ఏడో గ్యారెంటీ:
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల భర్తీ మీదే.
ఎనిమిదో గ్యారెంటీ:
ఇల్లు లేని ప్రతీ పేద కుటుంబానికి మహిళ పేరు మీద రూ.5లక్షలతో పక్కా ఇల్లు అందిస్తారు.
తొమ్మిదో గ్యారెంటీ:
ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్. అర్హులైన ప్రతీ ఒక్కరికి 4వేల పింఛన్, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్.
కాగా, ఏప్రిల్ 1న కాంగ్రెస్ కూటమి తమ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. అదే విధంగా వచ్చే వారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. షర్మిల తన ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేస్తారు..కాంగ్రెస్ గ్యారెంటీలు ఏ పార్టీపై ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారబోతోంది. జగన్ సంక్షేమ పథకాలు, చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు దీటుగా కాంగ్రెస్ 9 గ్యారెంటీలను తీసుకొస్తుండగా.. ఏ పార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ దెబ్బతీస్తుందా అనేది చూడాలి.