CM Jagan : రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్, వచ్చే నెలలో పోలింగ్ ఉండే అవకాశం ఉండడంతో పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలుపరుస్తున్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్య. ఇందులో గెలిస్తేనే పార్టీల భవిష్యత్ కు ఢోకా ఉండదు. ఈ ఎన్నికలతో నేతల రాతలు మారనున్నాయి. దీంతో ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రానుండడంతో సీఎం జగన్ తన చేతిలో ఉన్న అధికారాన్ని సంపూర్తిగా వాడుకుంటున్నారు.
ఇప్పటికే పలు సంక్షేమ పథకాల కింద సంబంధిత వర్గాలకు డబ్బులు వేసుకుంటూ వస్తున్నారు. రైతులకు, మహిళలకు..ఇలా పలు వర్గాలకు ప్రభుత్వ డబ్బులను వారి ఖాతాల్లో జమచేస్తున్న జగన్..ఇవాళ కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఈబీసీలకు ‘ఈబీసీ నేస్తం’ పథకం కింద నిధులను విడుదల చేశారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఆర్థికంగా వెనకబడిన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15వేల చొప్పున అందిస్తున్నారు. మూడేళ్ల పాటు వరుసగా ఈ సాయం వాళ్లకు అందిస్తారు.
ఇలా వరసగా నగదు పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్న జగన్ ..మహిళల ఓట్లపై ఆశలు పెంచుకున్నారు. జగన్ మొదటి నుంచి మౌలిక సదుపాయాల కల్పన కంటే ఓట్లు రాల్చే సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారనే చెప్పవచ్చు. అభివృద్ధిని గాలికొదిలేసి ఉచితాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేశాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాలను ఆపాలని ఎవరూ అనరు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం సాయం చేస్తుంటే ఎవరు మాత్రం వద్దని అంటారు. కానీ అభివృద్ధిని, రాష్ట్ర భవిష్యత్ ను పక్కనపెట్టి ఓట్ల కోసం ఉచితాలు అందిస్తామంటే ఆర్థిక అవగాహన ఉన్న ఏ ఒక్కరూ ఒప్పుకోరు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ఉచితాలే కాదు ఉపాధి కూడా అవసరమేనని మన ఏపీ పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో.