Yashaswi Jaiswal : జైస్వాల్ కు దేవుడు ఆయనే..కుర్రాడి తలరాతనే మార్చేశాడు..

Yashaswi Jaiswal

Yashaswi Jaiswal

Yashaswi Jaiswal : యశస్వి జైస్వాల్ ఈ కుర్రాడి పేరు ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం మారుమోగిపోతోంది. టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం ఇతడేనని ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇప్పటికే జరిగిన మూడు టెస్టుల్లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాది రికార్డుల మోత మోగించాడు. తొలి టెస్ట్ లో 80 పరుగులు చేసి మంచి ఇన్నింగ్సే ఆడాడు. మొత్తంగా ఈ టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.

కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ స్టార్ క్రికెటర్లు లేకపోయినా.. టీమిండియాకు నేనున్నానంటూ రెచ్చిపోతున్నాడు. అతడి ఆటకు భారత క్రికెట్ అభిమానులే కాదు.. యావత్ ప్రపంచం ఫిదా అయిపోతోంది. 22ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడే ఇలా ఆడుతుంటే.. ఇంకాస్త అనుభవం వస్తే.. బౌలర్లకు నిద్రలేకుండా చేస్తాడంటూ మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే జైస్వాల్ ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలు, చేసిన శ్రమ అంతా ఇంతా కాదు. చిన్న వయసులోనే జీవితానికి సరిపడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతడికి ఎంతో మంది సాయం చేసినా.. ఒక్క వ్యక్తి చలువ వల్లే జైస్వాల్ ఈ స్థాయిలో ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జుబిన్ భారుచా.. అతడి గురించి తెలుసుకుందాం..

ఉత్తర ప్రదేశ్ లో పుట్టిన జైస్వాల్ కు చిన్నతనంలోనే క్రికెటర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. పెద్ద క్రికెటర్ ను కావాలని కలలు కనేవాడు. సచిన్ అంత పెద్ద క్రికెటర్  అవ్వాలంటే ఇక్కడుంటే కుదరదని, ముంబై వెళ్లి మంచి ట్రైనింగ్ తీసుకోవాలని స్నేహితులు చెప్పిన మాటతో జైస్వాల్ ఇంటి నుంచి పారిపోయి.. ముంబై మహానగరానికి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి జైస్వాల్ కు కష్టాలు మొదలయ్యాయి. అప్పటివరకు ఇంట్లో గారాబంగా పెరిగిన జైస్వాల్ కు ముంబైలో ఎవరూ తెలియదు. ఎక్కడుండాలో అర్థం కాలేదు. కానీ, క్రికెట్ అవ్వాలనే అతడి సంకల్పం ముందు అవన్నీ చిన్న చిన్న సమస్యలానే కనిపించాయి.

ఏదో ఒక విధంగా క్రికెట్ ప్రాక్టిస్ తో పాటు.. పొట్టకూటి కోసం డెయిరీ ఉత్పత్తులు విక్రయించే షాపులో రాత్రిపూట పనికి కుదిరాడు. ముంబైలోని ప్రపంచ ప్రఖ్యాత అజాద్ మైదానంలో రోజంతా క్రికెట్ ప్రాక్టీస్ చేసి.. రాత్రిపూట ఆ డెయిరీ షాపులో పనిచేసేవాడు. అలా పొద్దంతా క్రికెట్ ప్రాక్టీస్ చేసి.. అలసిపోయి పనిపై దృష్టిపెట్టలేకపోవడంతో ఆ డెయిరీ షాపు యజమాని జైస్వాల్ ను పనిలో నుంచి తీసేశాడు. ‘కనీసం ఈ రాత్రికి నన్ను ఇక్కడ పడుకోనివ్వండి’ అంటూ జైస్వాల్ అతన్ని వేడుకున్నాడు. గుండెల్ని పిండేసే ఇలాంటి ఘటనలో జైస్వాల్ జీవితంలో ఎన్నో ఉన్నాయి.

ఈ విషయం మరుసటి రోజు తన కోచ్ కు ఫోన్ చేసి.. జరిగిన విషయం చెప్పడంతో ఆయన తన ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడే ఓ రెండు మూడు నెలలు ఉన్నాడు జైస్వాల్.  ఆ తర్వాత క్రికెట్ క్లబ్ లో గ్రౌండ్ మెన్ తో కలిసి ఉండే అవకాశం వచ్చింది. ఒక చిన్న టెంట్ లో జైస్వాల్ చాలా కాలం గడిపాడు. ఇంటికి ఫోన్ చేసినా.. తన ఇబ్బందుల గురించి చెప్పేవాడు కాదు. ఇలా ఎన్నో కష్టాలు పడుతూ దేశవాళీ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. కానీ జైస్వాల్ జీవితంలో ఊహించని మలుపు ఇక్కడే జరిగింది.

ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ టీమ్ కు డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్ గా ఉన్న జుబిన్ భారుచా.. యంగ్ క్రికెట్ టాలెంట్ హంట్ లో భాగంగా జైస్వాల్ ను చూశారు. ట్రయల్స్ కోసం వచ్చిన  జైస్వాల్.. తొలి బంతినే ఎక్రాస్ ది స్టంప్స్ వచ్చి స్క్వైర్ వెనుక నుంచి అద్భుతమైన ఫ్లిక్ షాట్ ఆడాడు. ఆ ఒక్క షాట్ చూసి.. భాచురా ఫిదా అయిపోయాడు. అంతే జైస్వాల్ తలరాతే మారిపోయింది. రాజస్తాన్ రాయల్స్ కోసం జైస్వాల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, అతడికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి.. అతడి నేచురల్ టాలెంట్ కు మరింత పదునుపెట్టించారు. ఒక్కో షాట్ ను 300 సార్లు ప్రాక్టీస్ చేయించి, 100 మీటర్ల దూరం కొట్టేలా జైస్వాల్ ను ట్రైన్ చేసి.. రాజస్తాన్ రాయల్స్ తరుఫున 2020 సీజన్ లో బరిలోకి దింపారు.

అక్కడి నుంచి జైస్వాల్ ఆట ఏంటో మనమంతా చూస్తున్నాం. భారత ఫస్ట్ క్రికెటర్ అయినా భారుచా 2008 నుంచి 2015 వరకు రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ గా పనిచేశారు. తిరిగి 2018 నుంచి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్ గా కొనసాగుతున్నారు. ఆయన కారణంగానే జైస్వాల్ ఐపీఎల్ లోకి చాలా త్వరగా ఎంట్రీ ఇచ్చాడు. పైగా అద్భుతమైన ట్రైనింగ్ పొందాడు. ప్రస్తుతం జైస్వాల్ ఈ రేంజ్ లో దుమ్మురేపుతున్నాడంటే.. జుబిన్ భారుచా దేవుడి రూపంలో అతడి జీవితంలోకి రావడమే కారణం.

TAGS