JAISW News Telugu

Azharuddin : బయటపడ్డ హెచ్‌సీఏ స్కాం.. అజారొద్దీన్ కు ఈడీ సమన్లు..

Azharuddin

Azharuddin

Azharuddin : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ తన పదవీకాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మాజీ ఎంపీకి గురువారం (అక్టోబర్ 3) రోజున ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ గతేడాది డిసెంబర్ లో మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ లను ప్రశ్నించింది. మాజీ మంత్రి, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్ ను కూడా సీబీఐ ప్రశ్నించింది. వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఇళ్లలో గతేడాది (2023) నవంబర్ ఈడీ సోదాలు నిర్వహించింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహించారు. రూ. 20 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి హైదరాబాద్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం డీజీ సెట్లు, అగ్నిమాపక వ్యవస్థలు, క్యానోపీల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డెడ్ లైన్లు విధించినప్పటికీ పలు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో ఖర్చులు, బడ్జెట్ పెంపు,  హెచ్ సీఏకు నష్టాలు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

రూ. 3.85 కోట్ల దుర్వినియోగానికి సంబంధించి అజారుద్దీన్ పై గతేడాది అక్టోబరులో నాలుగు క్రిమినల్ కేసులు నమోదవగా.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ బంతులు, జిమ్ పరికరాలు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, కుర్చీల కొనుగోలుకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ తో పాటు మరికొంత మందిపై నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపారు. హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం కేసులో అజారుద్దీన్ కు నాలుగు కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇవన్నీ ఆరోపణలేనని అజారొద్దీన్ పేర్కొన్నాడు.

2019 లో అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అతని పదవీకాలం 2023, ఫిబ్రవరిలో ముగిసింది. హెచ్‌సీఏ నిర్వహణ కోసం ఎన్నికల నిర్వహణను సులభతరం చేసేందుకు సుప్రీం కోర్టు ఏకసభ్య కమిటీని నియమించింది. అజారొద్దీన్ పదవీకాలంతో హెచ్‌సీఏలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. దీంతో పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టు వరకు చేరింది.

సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అజారుద్దీన్ ను హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించింది. 2023 ప్రారంభం వరకు హెచ్సీఏ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో దక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్నందున ఈ కేసుల కారణంగా ఓటర్ల జాబితా నుంచి అజారొద్దీన్ పేరును తొలగించారు.

Exit mobile version