Mohanlal Daughter : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో తెలిసిందే. ఆయనకు దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. దాదాపు 25 ఏండ్ల కిందటనే అక్కినేని, బాలయ్య, రోజా కాంబోలో వచ్చిన ‘గాంఢీవం’లోని ‘‘గోరువంక వాలగానే గోకులానికి..’’ అనే సూపర్ హిట్ సాంగ్ లో అతిథి పాత్రలో నటించారు. ఆ తర్వాత కూడా ఆయన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి.
తెలుగులో చిరంజీవి, తమిళంలో రజినీకాంత్ సమకాలికుడు మోహన్ లాల్. ఈయనది మలయాళంలో మెగాస్టార్ స్థాయి. తెలుగులో చిరంజీవిని మెగాస్టార్ గా పిలుచుకుంటాం. అలాగే మలయాళీలు మోహన్ లాల్ ను మెగాస్టార్ గా పిలుచుకుంటారు. అలాగే మోహన్ లాల్ నటించిన పలు సినిమాలను చిరంజీవి, వెంకటేశ్ రీమేక్ చేసి హిట్స్ కొట్టారు.
ఈమధ్య కాలంలో మన్యంపులి వంటి సినిమాలు తెలుగులోనూ విజయవంతమయ్యాయి. ముఖ్యంగా ఈయన సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మోహన్ లాల్ కీలకపాత్రలో పోషించి ప్రేక్షకులను అలరించారు. నటుడిగా మలయాళం టాప్ హీరో అయినా ఆయన వ్యక్తిగత జీవితం తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదనే చెప్పాలి.
తమిళ నిర్మాత కె.బాలాజీ కుమార్తె సుచిత్రను 1988లో వివాహం చేసుకున్నారు మోహన్ లాల్. వీరికి బాబు ప్రణవ్ మోహన్ లాల్, కూతురు విస్మయ మోహన్ లాల్ ఉన్నారు. ఇప్పటికే కొడుకు ప్రణవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కుమార్తె విస్మయ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా తన ఇన్ స్టాలో కూతురి ఫొటోను షేర్ చేస్తూ మోహన్ లాల్ ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘‘ నా యువరాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పటికీ ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ నాన్న..’’ అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం మోహన్ లాల్ షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. చాలా కాలం తర్వాత ఆయన కూతురి ఫొటోను చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. చాలా అందంగా ఉందని కొందరు, సినిమాల్లోకి తీసుకొస్తే పెద్ద హీరోయిన్ అవుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు సినిమాల్లోకి రావొద్దని, ఇక్కడ అంతా నెగిటివిటీ ఉంటుందని, చక్కగా కాపురం చేసుకుని ఆనందంగా ఉండమని సూచిస్తున్నారు.