Prashant Kishore : వైసీపీపై రహస్య నివేదిక ప్రశాంత్ కిషోర్‌కు చేరిందా.. ?
Prashant Kishore : దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఉరఫ్ పీకే ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గత కొంతకాలంగా పలు వేదికల్లో మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు లేవంటూ జోస్యం చెబుతున్నారు. జగన్ పాలన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని..ఆయన తిరిగి గెలిచే అవకాశాలు లేవన్నారు. 151 సీట్లు ఉన్న పార్టీని 50 స్థానాలకు తీసుకువస్తున్నారని పీకే వైసీపీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాతే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సైతం కౌంటర్ ఇచ్చారు.
ఐ ప్యాక్ ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో జగన్ మాట్లాడుతూ.. కచ్చితంగా మనమే అధికారంలోకి వస్తామంటూ చెప్పుకొచ్చారు. మరోసారి భారీ మెజార్టీతో వైసీపీ విజయదుందుబి మోగించనుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్‌కు జగన్‌కు కౌంటరిచ్చారు. ప్రశాంత్ కిశోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు తమ పార్టీ సాధించబోతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యల గురించి పీకే మాట్లాడుతూ.. తన అనుభవంతో చెబుతున్నానని.. జగన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రారని..జూన్ 4న ఫలితాల తర్వాత దీని గురించి మాట్లాడుకుందామన్నారు.
మరి.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ ఓడిపోతారని అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారో వైసీపీ నేతలకు మాత్రం అంతు చిక్కడం లేదు. ఇప్పటి వరకు వెలువడిన అన్ని సర్వేలతో పాటు, ఐ ప్యాక్ రిపోర్టులో కూడా మళ్లీ జగనే గెలుస్తారని తేల్చి చెప్పడం జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరీ ఇలాంటి సమయంలో కూడా వైసీపీ ఓడిపోతుందని పీకే చెప్పడంపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం ఈ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేయడంతో, వారే ప్రశాంత్ కిషోర్‌కు దీనిపై నివేదిక ఇచ్చారా ? అందుకే ఇంత ధైర్యంగా ఆయన వైసిపి అధికారంలోకి రాదని చెబుతున్నారా అనే అనుమానాలు వైసీపీ నేతల్లో మెదులుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు కూటమి నేతల్లో ఫుల్ జోష్‌ను నింపుతున్నాయి. మరీ వైసీపీ విషయంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజం అవుతాయో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు చూడాల్సిందే.