JAISW News Telugu

Harish Rao : ‘‘మేము కాదు మీరే ..’’ తెలంగాణ అసెంబ్లీలో హరీశ్ వర్సెస్ ఉత్తమ్, రేవంత్

Harish vs. Uttam, Revanth in Telangana Assembly

Harish Vs Uttam, Revanth in Telangana Assembly

Harish Vs Uttam, Revanth : ‘కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు’ అని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పుస్తకానికి ‘అవాస్తవాలు’ అని పేరు పెడితే బాగుండేదని మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపకానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను ఆయన ఖండించారు.

రెండో అపెక్స్ కమిటీ మీటింగ్ లో కృష్ణా నీటి ప్రాజెక్టులను KRMB కి అప్పగించేందుకు గత ప్రభుత్వం ఒప్పుకుందన్న విషయాన్ని హరీశ్ రావు ఖండించారు. ఇది అసత్య ఆరోపణగా మండిపడ్డారు. ఇందుకు ప్రస్తుత ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖ నిదర్శనమని ఆ లేఖను ఆయన చూపించారు. పేజీ నంబర్ 3 లోని పేరాగ్రాఫ్ సీలో ఈ వివరాలు ఉన్నాయన్నారు. 17వ KRMB మీటింగ్ లో కూడా గత ప్రభుత్వం KRMBకి అప్పగించేందుకు ఒప్పుకోలేదన్న విషయాన్ని రాహుల్ బొజ్జా రాశారని వివరించారు.

నీటి వాటాల పంపకంపై 50-50 నిష్పత్తిలో ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి 26 లేఖలు రాశామని హరీశ్ రావు చెప్పారు. ఐతే దీన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. 2014-2022 మధ్య తెలంగాణ ప్రభుత్వం 512 టీఎంసీలు ఇచ్చేందుకు ఒప్పుకుందని, గత సంవత్సర కాలం  నుంచి మాత్రమే 50-50 కోసం కోరిందని చెప్పారు. ఈవాదననూ హరీశ్ తిప్పికొట్టారు. ఇది అసత్యమని చెప్పారు.

ఈసమయంలో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణకు కీలకమైన కృష్ణా జలాలపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణకు 68 శాతం వాటా ఇవ్వాలనే తీర్మానం పెడుతుంటే, దాన్ని ఆమోదించకుండా, సభకు రాకుండా, ఫామ్ హౌస్ లో పడుకున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. దీనికి హరీశ్ రావు స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు.  కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిస్తూ కేంద్రంతో జరిగిన మీటింగ్ లో ఒప్పుకుందని అన్నారు. ఈ మీటింగ్ గత నెల 17న జరిగిందని, మర్నాడు పేపర్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించలేదని ఆరోపించారు.

ఈ వాదనను మంత్రి ఉత్తమ్ ఖండించారు. ఈ ప్రాజెక్టులను అప్పగించలేదని, నీటిపారుదల శాఖ మంత్రిగా తానే ఈ విషయాన్ని చెబుతుంటే మంత్రి హరీశ్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.  కాగా, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల అప్పగింత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతునిస్తున్నామని హరీశ్ చెప్పారు. కానీ గత ప్రభుత్వం అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక అత్యవసరంగా సభలో తీర్మానం పెట్టారంటే రేపటి బీఆర్ఎస్ నల్గొండ సభనే కారణమని చెప్పుకొచ్చారు.

Exit mobile version