Sankranthi : మూడురోజుల పర్వదినాలైన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో..

Sankranthi : 

సంక్రాంతి

చలి…చలి…చలి..చలిలో
కాలజ్ఞాని మేల్కొలుపు ల్లో
వేకువ చేసే కువకువలో
చక్కని చుక్కలు చుక్కల చక్కగ చెక్కిన వల్లులలో…
రంగవల్లులలో కాలం కురిసిన. కాంతి ఈ సంక్రాంతి

శ్రీకరమౌ..శుభకరమౌ
ముద్దు గొబ్బి సింగారపు రంగుల సుద్దులలో
విచ్చీ విచ్చని విచిత్ర సుమాం చలాల చలనాలలో
అగరు ధూప సుగంధాలలో
పలు వర్ణ పర్ణాల పక్షుల వింత విన్యాసాల మెరిసిన కాలం కాంతి ఈ సంక్రాంతి
” చేమంతి పూవంటి చెల్లెలైనీయవే
తామర పూవంటి తమ్ముణ్ణీయవే ” అనే గీతాలలో
శ్రుతి శుభగమౌ హరిదాసు కీర్తనలలో
సవుని నులివెచ్చని సూనలలో
ఆశల కోమల కోరకాల విచ్చుకున్న కాలం కాంతి
……..ఈ సంక్రాంతి

శృంగారపు గంగెద్దాటలలో
సన్నాయి పాటలలో
పందెపు నందపు చోటులలో
మొక్కిన మొక్కులీడేరుననే
బుడబుక్కలవాని పదాలలో
పిట్టల దొరలు తమాషా మాటల్లో కాలం కురిసే ధ్వని ఘన మంత్రం ఈ సంక్రాంతి

సంబరమంతా తమదనె పిల్లల కేరింతలతో
బంతిపూల తోరాలలో
ఇంతుల మంద హాసాలలో
వాకిట కట్టిన వరికంకెల
వన్నెల్లో
ఈ దేవోత్సవమే మా జీవితమనే కళాకారులలో
సంతోషాల కాలం.ఇచ్చే శాంతి ఈ సంక్రాంతి

రోకటి పోటుల పాటలలో
తీపి తీపి పిండివంటలలో
పొంగే ప్రేమల గురుతులలో
కొత్త రుచుల పొంగళ్ళలో
పచ్చని పూల పుప్పొళ్ళలో
మణులంటి మందారాలలో
తెచ్చె పుడమికి నవ కాంతి
ఈ సంక్రాంతి

ప్రణయాలే ముద్దంటూ
సంతసాన మనుమంటూ
ఇంపు పెంచే సంక్రాంతంట
ఆనందాలే ప్రతి ఇంట

=రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

TAGS