Relief For Telangana Govt : ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖజానా నిండుకుండలా ఉంటుందనుకుంటే ఖాళీగా కనిపించడంతో సీఎం, మంత్రులు అవాక్కయ్యారు. ప్రజలకు ఇచ్చిన భారీ హామీల అమలు ఎలా చేయాలోనని తికమక పడ్డారు. మొత్తానికైతే రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నారు. మిగతా వాటి కోసం అప్లికేషన్లు తీసుకున్నారు.
ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. ఖాళీ ఖజానాతో కష్టాల్లో ఉన్న సమయంలో అప్పు పుట్టింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలతో కూడిన చివరి త్రైమాసికంలో రూ.9 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ముందుగా రూ.2వేలకోట్లను ఈనెల 16న తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా, రాష్ట్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన అప్పులో వెయ్యి కోట్లు మినహా మిగతా అప్పును గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటికే తీసుకోవడంతో కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి నిధుల కటకట ఏర్పడింది. చివరి త్రైమాసికంలో అప్పు తీసుకునే పరిస్థితి లేకపోయింది.
దీంతో రూ.13వేల కోట్ల అదనపు అప్పు కావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ .. ప్రధాని మోదీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి అదనపు అప్పు గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉందని వివరించారు.
ఆర్బీఐ డిసెంబర్ లో ప్రకటించిన అడ్వాన్స్ డ్ క్యాలెండర్ లోనూ తెలంగాణకు సంబంధించిన రూ.13వేల కోట్ల వివరాలు వెల్లడించారు. అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మాత్రం బడ్జెట్ లోని నికర, స్థూల అప్పుల వివరాలను సమగ్రంగా సమీక్షించి రూ.15వేల కోట్ల అప్పులు కావాలని కేంద్రానికి ప్రతిపాదించారు.
రాష్ట్ర ప్రభుత్వ వినతితో.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూ.9 వేల కోట్ల అప్పునకు కేంద్రం తాజాగా పర్మిషన్ ఇచ్చింది. ఈనెల 16న జరిగే ఆర్బీఐ వేలం పాటలో పాల్గొనవచ్చని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో రూ.2 వేల కోట్లు అప్పు తీసుకునే అవకాశం ఉంది.