Half Day Schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు మార్చి 15 (శుక్రవారం) నుంచి ఒంటి పూట తరగతులు ప్రారంభించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. తరగతులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగించాలని ఆదేశించింది.
ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్, ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలన్నీ ఈ నిబంధనలు పాటించాలని శాఖ పేర్కొంది. ఇక, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం నేపథ్యంలో 12.30 గంటలకు స్కూల్ ముగిసిన తర్వాత పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించింది. ఆ తర్వాతనే వారిని ఇంటికి పంపించాలని సూచించింది.
అప్పటి వరకు ఒంటి పూటే
పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. అయితే పదో తరగతి పరీక్షా కేంద్రం ఉన్న పాఠశాలలకు తరగతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని ఆదేశించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 23వ తేదీ చివరి పని దినంగా నిర్ధేశించింది.
అప్పటి వరకు విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించి ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఎండాకాలం (వేసవి) సెలవులు ప్రకటించాలని శాఖ ఆదేశించారు. ఇక, అప్పటి వరకు కూడా ఒంటి పూట బడులే నిర్వహిస్తారు. ఈ సమాచారాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపాలని విద్యా శాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలు ఆదేశాలను పక్కన పెట్టి తరగతులని, ప్రైవేట్ క్లాసులని, ముందస్తు పదో తరగతి క్లాసులని మొదలు పెడితే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.