Hakimpet Sports School : తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసింది భారతీయ సమాజం. మట్టిముద్దల్లాంటి పిల్లలను ప్రయోజకులుగా మార్చేది గురువులే. వీరిలో కొందరు అనుచిత ప్రవర్తనతో గురు సమాజానికే మచ్చ తేవడం ఇటీవల గమనిస్తూనే ఉన్నాం. కానీ కొందరు గురువులు వారు ఏ తప్పు చేయకున్నా వివిధ కుట్రల ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కుట్రే హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీగా పనిచేసిన హరికృష్ణపై జరిగిందని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఆ మధ్య హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో లైంగిక వేధింపులు అనే వార్తలు వచ్చాయి. ఇది మన అందరికీ తెలిసిందే. అక్కడ ఓఎస్డీగా పనిచేసే హరికృష్ణ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వార్తలు రావడంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. అయితే ఆయనపై కుట్రపూరితంగానే కొందరు లైంగిక వేధింపుల కేసులో ఇరికించారని స్వయాన అక్కడి స్టూడెంట్లు, వారి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
ఆరోపించడమే కాదు వారు ధర్నాలు, నిరసనలు తెలియజేసి మరి ఓఎస్డీ హరికృష్ణ ఏ తప్పు చేయలేదని, ఆయన్నే తిరిగి స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీగా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘ మా సార్ మాకు కావాలి’’ అంటూ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. తమ సార్ కు న్యాయం జరగాలని, లైంగిక వేధింపులకు పాల్పడిన అసలు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఒక ఉపాధ్యాయుడి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలంటే అక్కడి విద్యార్థులను అడిగితే తెలుస్తుంది. వారిని ఉపాధ్యాయుడు ఒక తండ్రిలాగా చూసుకుంటున్నాడా? లేక కామంతో చూస్తున్నాడా? అనేది అక్కడి విద్యార్థినులకు ఈజీగా తెలిసిపోతోంది. ఓఎస్డీ హరికృష్ణపై అక్కడి విద్యార్థినులకు, తల్లిదండ్రులకు ఉన్న అభిమానం చూస్తే ఆయన వేధింపులకు పాల్పడలేదని ఎవరికైనా తెలుస్తుంది. విధుల్లో ఆయన నిబద్ధతను ఆ విద్యార్థులే స్వయంగా చెప్తున్నారు. అలాంటప్పుడు అసలు నిందితులు ఎవరో తెలుసుకోకుండా హరికృష్ణపై నిందలు వేయడంపై విద్యార్థినులు, పేరెంట్స్ మండిపడుతున్నారు. లైంగిక వేధింపుల కేసులో అసలు నిందితులు ఎవరో తెలుసుకోకుండా బాధ్యత కలిగిన ఓఎస్డీ హరికృష్ణను శిక్షించడం భావ్యం కాదని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో స్పందించాలని ఓఎస్డీ హరికృష్ణకు న్యాయం చేయాలని, ఆయన్ను తమ స్కూల్ కే ఓఎస్డీగా నియమించాలని కోరడం గమనార్హం.