Saudi Arabia : సౌదీలో వడదెబ్బ కారణంగా వేయి మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. సౌదీ అరేబియాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం క్రితం అత్యధికంగా 51.8 డిగ్రీలు నమోదైనట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హజ్ యాత్రకు వెళ్లిన వారిలో వడదెబ్బ కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 1000 దాటినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు ఈజిప్టు దేశస్థులే కాగా.. భారత్, పాకిస్థాన్, జోర్డాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనిషియాకు చెందినవారు ఉన్నట్లు సమాచారం.
మృతి చెందినవారిలో అత్యధికంగా ఈజిప్టు వాసులే ఉన్నట్లు అరబ్ రాయబారి వెల్లడించారు. గురువారం ఒక్కరోజే ఆ దేశానికి చెందిన 58 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 658కి చేరింది. వీరిలో 630 మంది అనుమతి లేని యాత్రికులే ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 10 దేశాలకు చెందిన 1081 మంది యాత్రికులు ఎండదెబ్బకు మరణించినట్లు తెలిసింది. ఆయా దేశాల రాయబార కార్యాలయాల ప్రకటనల ఆధారంగా ఈ సంఖ్యను లెక్కించినట్లు సమాచారం. మెడికల్ కాంప్లెక్స్ వద్ద కొంతమంది మృతుల వివరాలు ప్రకటించారు. జాబితాలో అల్జీరియా, ఈజిప్టుతో పాటు భారత్ కు చెందినవారి పేర్లు కూడా ఉన్నాయి.