Guntur Karam Records : ప్రిన్స్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ దెబ్బకు గతంలోని సౌత్ ఇండియన్ సినిమాల రికార్డులు గల్లంతైపోతున్నాయి. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా ‘గుంటూరు కారం’ ట్రైలర్ నిలిచింది. కేవలం 24గంటల్లోనే 39 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని మేకర్స్ ప్రకటించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ ఆడియన్స్ కు ముందుకొస్తుంది. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేశ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తుండగా, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, జయరాం, రావు రమేశ్, ఈశ్వరీరావు తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(జనవరి 9) గుంటూరులో గ్రాండ్ గా జరుగనుంది. మొదట ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేయగా అక్కడ అనుమతులు రాకపోవడంతో వాయిదా పడింది. దీంతో గుంటూరులో ఈవెంట్ జరపాలని నిర్ణయించి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ అద్భుత స్పందనతో దూసుకెళ్తుండగా.. రికార్డులన్నీ తుడుచుకుపెట్టుకుపోతున్నాయి. ట్రైలర్ ఇన్ని రికార్డులు బ్రేక్ చేస్తుండగా.. సంక్రాంతి పందేంకోడిగా వస్తున్న ఈ మూవీ మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందోనని జనాల్లో ఆసక్తి నెలకొంది. మోస్ట్ ప్రెస్టిజీయస్ గా వస్తున్న మహేశ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి విజేత తమ ప్రిన్సే అని ఖుషీ అవుతున్నారు.
కాగా, సంక్రాంతి సినిమా పోటీ చాలా తీవ్రంగా ఉంది. తేజ సజ్జ మూవీ హను-మాన్, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నాసామిరంగ’ సినిమాలు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన స్క్రీన్ల కొరత నెలకొంది. అయితే సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చిన ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో అందరూ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. వీటన్నంటిలో గుంటూరు కారానికి ఎక్కువ థియేటర్లు దొరికినట్టు చెబుతున్నారు. ఇక 12వ తేదీనే వస్తుండడంతో ఈ మూవీకే భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.