Durga Rao : జగన్ పై గులకరాయి.. దుర్గారావును ఇరికించాలని చూశారా?
Durga Rao : ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన బస్సు యాత్రలో ఎవరో ఓ ఆకతాయి రాయితో దాడి చేయడంతో మొత్తం రాష్ట్ర అధికార యంత్రాంగమే కదిలింది. దాడికి కారణమెవరనే దానిపై అధికారులు నానా హంగామా చేశారు. దాన్ని పెద్ద దాడిగా అభివర్ణించారు. చాలా మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో భాగంగా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును కూడా పోలీసులు అరెస్టు చేసి నాలుగు రోజులు రిమాండ్ లోనే ఉంచారు.
జగన్ పై దాడికి నువ్వే కారణమంటూ అతడిని భయపెట్టారు. నేరం ఒప్పుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చంద్రబాబు నీతో రాయి వేయాలని చెప్పారు కదా అని వేధించారు. దానికి దుర్గారావు నో చెప్పడంతో అతడిని కొట్టారు. బెదిరించారు. నేరం ఒప్పుకోకపోతే బాగుండదని హెచ్చరించారు. కానీ అతడు మాత్రం బెదిరింపులకు జడవలేదు. తాను ఎవరి కోసమో నేరం ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పాడు.
రోజుకు ఐదు గంటల పాటు విచారించారు. శనివారం రాత్రి దుర్గారావును విడిచిపెట్టారు. సీసీఎస్ స్టేషన్లో దుర్గారావును ప్రశ్నించారు. రాయి నువ్వే వేశావని ఒప్పుకోవాలని పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. నేరం అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరించారు. వారు ఎంతలా బెదిరించినా నేరం అంగీకరించేది లేదని చెప్పడంతో విడిచిపెట్టారు.
విజయవాడ సీసీఎస్ నుంచి 18న మైలవరం సర్కిల్ కార్యాలయానికి తరలించారు. అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు విచారించారు. మానసికంగా వేధించారు. నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. తాను నేరం చేయకుండా ఒప్పుకోను అని తెగేసి చెప్పడంతో వారు దిగి రాక తప్పలేదు. లేకపోతే భయపడి నేరం ఒప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఉండేవి.
దుర్గారావును పోలీసులు నానా ఇబ్బందులకు గురి చేశారు. నేరం ఒప్పించాలని తెగ ఉబలాటపడ్డారు. చంద్రబాబుపై కేసు బనాయించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ దుర్గారావు ససేమిరా అనడంతో వారికి వేరే దారి కనిపించలేదు. ఇలా రాష్ట్రంలో జగన్ పాలన నియంతగా కనిపిస్తోంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది.