Kodali Nani : ఎన్నికలు మరో రెండు నెలల్లోనే ఉన్నాయి. వైసీపీ ఇప్పటికే జాబితాలు ప్రకటిస్తున్నా..ఇంకా కొందరు ముఖ్యులకు సీటు కన్ఫర్మ్ కాకపోవడంతో రకరకాల ప్రచారాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. గుడివాడలో కొడాలి నానికి సీఎం జగన్ ఇంకా టికెట్ ఖరారు చేయలేదు. దీంతో కొంతకాలంగా ఆయన టికెట్ మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గుడివాడలో కొడాలి నాని కాకుండా ఇంకెవరు అనే ప్రశ్న తలెత్తితే ఏ ఒక్కరూ కనిపించరు. కానీ తాజాగా మండల హనుమంతరావు అనే నాయకుడు తెరపైకి వచ్చారు. ఆయన పేరుతో గుడివాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయనకే టికెట్ దక్కిందంటూ శుభాకాంక్షలు చెబుతూ ఆ ఫ్లెక్సీలు వెలిశాయి.
కొద్దిసేపటికే వాటిని పోలీసులు తొలగించారు. అయితే ఆ కొద్దిసేపే చాలు తీవ్రంగా ప్రచారం కావడానికి. ఇంతకీ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎవరు? తాము ఏర్పాటు చేసుకున్నామని కానీ.. ఏర్పాటు చేయలేదని కానీ మండల హనుమంతరావు వర్గీయుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పోనీ టీడీపీ నేతలే కొడాలి నానిపై తప్పుడు ప్రచారానికి ఇలా చేశారా అంటే.. అలా చేసి ఉంటే.. పోలీసులు దేశద్రోహం కేసు పెట్టేసి ఉండేవాళ్లు. కానీ ఫ్లెక్సీలు మాత్రం తీసుకెళ్లి సైలెంట్ గా ఉండిపోయారు. అంటే వైసీపీలో తెరవెనుక ఏదో జరుగుతోందన్న గుసగుసలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు. దీంతో గుడివాడ నుంచి కొడాలి నానిని గన్నవరంనకు పంపి వంశీని విజయవాడ ఎంపీగా బరిలో నిలుపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కేశినాని నానికి ఏదో ఓ అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
మొత్తానికి వైసీపీలో ఏదో జరుగుతోందని కచ్చితంగా చెప్పవచ్చు. నిప్పులేనిదే పొగ రాదు. వైసీపీ హైకమాండ్ కు తెలిసే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ప్రజల మూడ్ తెలుసుకునేందుకు ఇలా చేశారని అంటున్నారు. అయితే ఈ ఫ్లెక్సీల గురించి విచిత్రంగా చెప్పుకుంటున్నారు కానీ. కొడాలి నానినే గుడివాడ ఎమ్మెల్యేగా ఉండాలని ఒక్కరు కూడా వీధుల్లోకి రాకపోవడం అక్కడి పరిస్థితిని తెలియజేస్తోంది.