GT VS CSK : గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ విజయం నమోదు చేసింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్లు సెంచరీలతో కదం తొక్కారు. శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు పోటీ పడి మరీ సిక్సులు, ఫోర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
టాస్ గెలిచి చెన్నై ఫీల్డింగ్ తీసుకోగా.. ఆ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టలేదు. సాయి సుదర్శన్ 51 బంతుల్లో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 104 పరుగులు చేసి చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశాడు. చెన్నై టీంలో వీరి దెబ్బకు సిమర్ జిత్ సింగ్ నాలుగు ఓవర్లలోనే 60 పరుగులు సమర్పించుకున్నాడు. సాయి సుదర్శన్ 7 సిక్సులు, 5 ఫోర్లు బాదాడు. గిల్ తొమ్మిది ఫోర్లు ఆరు సిక్సర్లతో చెలరేగాడు. కానీ చివర్లో వీరిద్దరూ ఔట్ కావడంతో స్కోరు వేగం మందగించినా.. 20 ఓవర్లలో 231 పరుగులు భారీ స్కోరు చేసి ఇన్సింగ్స్ ను ముగించింది.
ఇంత భారీ స్కోరు అయినప్పటికీ చెన్నై బౌలర్, శార్దూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన చెన్నైకు ఆరంభంలోనే అజింక్య రహానే వికెట్ కోల్పోయింది. అనంతరం రుతురాజ్ గైక్వాడ్, మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర రనౌట్ కావడంతో 2పరుగులకే 2 వికెట్లు, 10 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో డారెల్ మిచెల్, మొయిన్ అలీ ఇద్దరు బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
డారెల్ మిచెల్ 34 బంతుల్లో 7 సిక్సులు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేయగా.. మొయిన్ అలీ నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లతో 66 పరుగులు చేసి ఔటయ్యారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ చెన్నై వైపు కనిపించినా ఇద్దరు ఔటయ్యాక చెన్నై రేసులో నుంచి తప్పుకుంది. అయితే చివర్లో దోని మూడు సిక్సులు కొట్టినా.. అవి పరుగుల అంతరాన్ని తగ్గించడమే కానీ గెలిపించేంత కావు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్స్ టేబుల్స్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 8 వస్థానంలోకి రాగా.. చెన్నై స్టిల్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్న దశలో చెన్నై రెండింట్లో గెలిస్తేనే ప్లే ఆప్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఇంటి బాట పట్టాల్సిందే.