Telangana RTC Jobs : తెలంగాణ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
Telangana RTC Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ అధికారుల ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మొత్తం 3,035 పోస్టులను భర్తీ చేయనుండగా, అందులో 2 వేల డ్రైవర్ ఉద్యోగాు, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 7 మెడికల్ ఆఫీసర్ (జనరల్), 7 మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) ఉద్యోగాలు ఉన్నాయి.
ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన వెంటనే 3,035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.