Turkey : టర్కీలో ఓ పురాతన గ్రీకు నిధి బయటపడింది. తుర్కియే పశ్చిమ ప్రాంతంలో ఇటీవల పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో ఓ కుండ నిండా బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆ బంగారు నాణేలపై మోకరిల్లిన విలుకాడు చిహ్నం ఉంది. వీటితో పాటు ఎంతో విలువైన పలు వస్తువులను కూడా గుర్తించారు. ఇవన్నీ క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ఇవి పురాతన గ్రీకు రాజ్యానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు. వీటిని సర్డిస్ అనే ప్రాంతంలో తయారు చేసినట్లు భావిస్తున్నారు.
ఈ నాణేలు కిరాయి సైనికులకు చెల్లింపుగా ఉపయోగించారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే భూమి లోపల దాచడానికి గల కారణాలు మాత్రం అంతుబట్టడం లేదు. ఇంత.. అమూల్యమైన నాణేలను తిరిగి పొందాలనే ఉద్దేశ్యం లేకుండా ఎవరూ పాతిపెట్టరు. తీవ్రమైన దురదృష్టంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చునని మిచిగాన్ యూనివర్సిటీ పురావస్తు శాస్త్ర ప్రొఫెసర్, నోషన్ ఆర్కియాలజికల్ సర్వే డైరెక్టర్ క్రిస్టోఫర్ రాట్టే పేర్కొన్నారు.