West Indies Vs Uganda : ఉగాండా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన 18 వ మ్యాచ్ లో ఉగాండాను 39 పరుగులకే ఆలౌట్ చేసి వెస్టిండీస్ ఘన విజయం సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 173/5 తో ఇన్సింగ్స్ ముగించింది. వెస్టిండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పూరన్ 22, పావెల్ 23, రస్సెల్ 30, రూథర్ పార్ట్ 27 పరుగులతో జట్టు 173 పరుగులు చేయడంలో తోడ్పడ్డారు.
ఉగాండా బౌలర్లు వెస్టిండీస్ బ్యాటర్లను 173 పరుగులకు కట్టడి చేయడం గొప్ప విషయమే అయినా బ్యాటింగ్ లో మాత్రం తడబడి కేవలం 39 పరుగులకే ఆలౌట్ అయి దారుణ పరాభవాన్ని మూట గట్టుకుంది. ఉగాండా బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు తీయగా.. ఓపెనింగ్ బౌలర్ రాంజనీ మూడు ఓవర్లో 16 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
అనంతరం 174 పరుగుల ఛేజింగ్ తో బరిలోకి దిగిన ఉగాండా బ్యాటర్లను వెస్టిండీస్ స్పిన్నర్ అఖిల్ హుస్సేన్.. నాలుగు ఓవర్లు వేసి 11 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా నిప్పులు చెరిగే బంతులతో ఉగాండాను కట్టడి చేయడంతో బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయకుండానే వెనుదిరిగారు.
ఉగాండా బ్యాటింగ్ లో తొమ్మిదో నెంబర్ బ్యాట్స్ మెన్ ఒక్కడే 11 పరుగులతో డబుల్ డిజిట్ స్కోరును అందుకోగా.. కేవలం 12 ఓవర్లలోనే 39 పరుగులకు ఆలౌట్ అయి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఉగాండా బ్యాటర్లు ఏ దశలోనూ నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేక పెవిలియన్ కు క్యూ కట్టారు. వెస్టిండీస్ రెండు విజయాలతో పాయింట్ల టేబుల్స్ లో ముందుకు వెళ్లగా.. రాబోయే రెండు మ్యాచులు న్యూజిలాండ్, అఫ్గాన్ తో ఆడనుంది. ఇందులో ఏ ఒక్కటి గెలిచినా సూపర్ 8 కు వెళ్లే చాన్సు ఉంటుంది.