JAISW News Telugu

Nirmala Sitharaman : వచ్చే ఐదేళ్లలో అద్భుత ప్రగతి.. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman

Nirmala Sitharaman Budget 2024

Nirmala Sitharaman : రానున్న ఐదేళ్లలో భారత్‌ అద్భుత ప్రగతి సాధిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉంటాయని  పేర్కొన్నారు. భారత్‌కు మాత్రమే ‘డెమొక్రసీ, డెమొగ్రఫీ, డైవర్సిటీ’ కి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందని చెప్పారు. లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ 2024ను ప్రవేశపెడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

80 కోట్ల మందికి ఉచిత రేషన్‌..
‘పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పులు వచ్చాయి. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశ ప్రజలు తమ భవిష్యత్‌పై భారీ ఆశలతో ఉన్నారు. పేదలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నాం. దీని ఫలితాలను 80 కోట్ల మంది పొందుతున్నారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచుతున్నాం. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సాగుతాం.

అభివృద్ధి చెందిన భారతే లక్ష్యం..
2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చదిద్దుతాం. గతంలో సామాజిక న్యాయం రాజకీయ నినాదంగా ఉండేది. కానీ, మేం దాన్ని అమలు చేసి చూపించాం. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై ప్రభుత్వం దృష్టి సారించింది.

భారీ ఎత్తున రుణసాయం..
‘పీఎం స్వానిధి’ కింద 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాం. మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇస్తాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్‌ ధన్‌ ఖాతాలకు నేరుగా రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశాం. దీని వల్ల ప్రభుత్వానికి రూ.2.7లక్షల కోట్లు ఆదా అయ్యింది. ‘స్కిల్‌ ఇండియా మిషన్‌’ కింద 1.4 కోట్ల మంది యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ట్రెయినింగ్ ఇచ్చాం. పీఎం ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్ల విలువైన రూ. 43 కోట్ల రుణాలను మంజూరు చేశాం.

ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం
‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌’ యోజన కింద ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం ఇస్తున్నాం. ‘పీఎం ఫసల్‌ బీమా’ యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతోంది. జాతీయ విద్యా విధానం ద్వారా అనేక మార్పులు తెచ్చాం. 3000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 15 ఎయిమ్స్‌లు, 16 ఐఐఐటీలు, 390 యూనివర్సిటీలను ఏర్పాటు చేశాం. పదేళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు శాతం 28కి పెరిగింది.

రాష్ట్రాలకు సహకారం..
ఆర్థిక వ్యవస్థను సంఘటితం చేసేందుకు డిజిటల్‌ ఇండియా చాలా కీలకం. పన్ను వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలతో ట్యాక్స్‌ చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పొదుపులు, పెట్టుబడులకు భద్రత కలిగింది. మూలధన పెట్టుబడులకు ‘గిప్ట్‌ (GIFT)’ ఒక ప్రధాన మార్గంగా మారింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ఆధునిక మౌలిక సదుపాయాలే వికసిత్‌ భారత్‌ విజన్‌. ఆశావహ జిల్లాల అభివృద్ధికి కేంద్రం రాష్ట్రాలకు సాయం అందిస్తుంది. భారత్ వృద్ధి పథంలో తూర్పు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తాం’ అంటూ సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

Exit mobile version