Vinayaka Nimajjanam : న్యూజెర్సీలోని SDP SSV దేవాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం
Vinayaka Nimajjanam : మండపాల్లో కొలువుదీరి తొమ్మిది రోజుల పాటు భక్తులతో పూజలను అందుకుని గణేషుడు.. తన తల్లి గంగమ్మ ఒడిలోకి చేరే సమయం ఆసన్నం అయింది. అమెరికాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఉన్న శ్రీసాయిదత్త పీఠం శ్రీశివ విష్ణు ఆలయంలో గణేష్ నవరాత్రి వేడుకలను ఎన్నారైలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణేష్ చతుర్థి తో మొదలయ్యే ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తులు. ఒక్కొక్కటిగా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమెరికాలోని న్యూజెర్సీలోని SDP SSV దేవాలయంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, తెలుగు వారు పాల్గొని పూజలు చేశారు.
ఈ గణేష్ నవరాత్రి వేడుకలను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 6న వినాయకుడి ప్రతిష్ట పూజ నిర్వహించారు. కాకడ హారతి, పుణ్యాహవచనం, కలశ స్థాపన చేశారు. సెప్టెంబర్ 6 నుంచి 14 వరకూ నవరాత్రులు కొనసాగాయి. సెప్టెంబర్ 7 నుంచి 15వరకు ప్రతి రోజూ స్వామి వారికి రోజుకో అలంకారంతో పూజ, అర్చన, ప్రసాదం నిర్వహించారు. కీర్తనలు, భజనలతో తొమ్మిది రోజుల పాటు గణేషుడి సేవలో అక్కడి భక్తులు తరించారు. సెప్టెంబర్ 7న హల్దీ, 8న విభూతి, 9న గంధం, 10న కుంకుమ, 11న స్వామి వారికి దధి (పెరుగు)అభిషేకం, 12న డ్రై ఫ్రూట్స్, 13న కొబ్బరి పొడి, 14న ముత్యాలు, 15న పూలు, గరిక పోసలతో అభిషేకం నిర్వహించారు. శ్రీసాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అన్న ప్రసాదాలు అందజేశారు.
‘ద మాల్ ఎట్ ఓక్ ట్రీ’, ఓక్ ట్రీ రోడ్, న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలోని SDP SSV దేవాలయంలో ఈ గణపతి చతుర్థి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. తొమ్మిది రోజలు పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు 15వ తారీఖున సాయంత్రం ఐదు గంటలకు నిమజ్జానానికి బయలు దేరారు. గణేషుడి భారీ సంఖ్యలో అక్కడి భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు.