GPS tracker : కాలికి జీపీఎస్ ట్రాకర్, కెమెరాతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ గద్ద కలకలం సృష్టించింది. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో కాలికి జిపిఎస్ ట్రాకర్, కెమెరా ఉన్న గద్ద స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడి నుంచో చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం గుట్ట ప్రాంతానికి వచ్చిన గద్ద చాలాసేపు అక్కడే కూర్చుండి పోయింది. గద్ద అలసిపోయి ఉండడం గమనించిన స్థానికులు కోడి మాంసాన్ని వేసి దాన్ని కట్టివేశారు.
ఆకలితో ఉన్న గద్ద కోడి మాంసాన్ని తిన్నది. అక్కడి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత వేరే ప్రాంతానికి ఎగిరిపోయింది. అక్కడ ఉన్న స్థానికులు గద్ద ఫొటోలను వీడియోలను తీశారు. ఆ గడ్డ కాళ్లకు జిపిఎస్ ట్రాకర్ తో పాటు కెమెరా కూడా ఉండడం స్థానికుల్లో చర్చనీయాంశం అయింది. ఈ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులను వివరణ అడగగా సమాచారం అందలేదని వారు తెలిపారు. గద్ద ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.