Telangana Employees : జీతాలు 5లోపే పడ్డాయోచ్.. తెలంగాణ ఉద్యోగుల సంబరాలు..

Telangana Employees

Telangana Employees Salaries Credit 5th

Telangana Employees : తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు మద్దతుగా నిలబడింది ప్రధానంగా ఉద్యోగులు, నిరుద్యోగులు. సాధారణ ప్రజలు అందరూ ఉద్యమానికి మద్దతుగానే ఉన్నా.. వారిలో కొందరు వివిధ పార్టీల వైపు ఉంటారు. కొందరు ప్రత్యక్షంగా తిరగలేరు. ఎక్కువ మంది వారి వారి పనుల్లో బిజీబిజీగా ఉంటారు. తెలంగాణ ఎందుకు కావాలి? అనే స్పష్టత మొదటినుంచి నిరుద్యోగులు, ఉద్యోగుల్లోనే ఉందని చెప్పాలి. 1952నుంచి మొదలు తెలంగాణ వచ్చే వరకు ఏనాడూ పోరాటాన్ని వీడనిది ఉద్యోగులు, నిరుద్యోగులే. ఇక వీరే 2001నుంచి 2014దాక కేసీఆర్ సారథ్యంలో నడిచిన ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు.

ఉద్యోగులు, నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చినా కేసీఆర్.. ఆ తర్వాత వారిని విస్మరించడం మొదలుపెట్టారు. మొదట్లో భారీగా ఫిట్ మెంట్ పెంచినా ఆ తర్వాత మళ్లీ ఏ రోజు వారి సమస్యలు పరిష్కరించలేదు. దేశంలోనే అత్యధిక జీతాలు తీసుకుంటున్నది తెలంగాణ ఉద్యోగులే అని సభల్లో ప్రసంగించడమే తప్ప వారికి చేసిందేమీ లేదు. ఉద్యోగ సంఘాల నాయకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. కేసీఆర్ రెండో టర్మ్ నుంచి ఉద్యోగుల కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. వారికి పీఆర్సీలేదు, డీఏలు ఇవ్వలేదు..అలాగే వారికి జీతాలు కూడా ఏ రోజు కూడా 1వ తారీఖున ఇవ్వలేదు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 1వ తేదీ నాడే జీతాలు పడేవి. గత ఐదారేండ్లుగా 15వ తేదీ వరకు కూడా జీతాలు పడే దిక్కు లేకుండా పోయింది.

జీతాల విషయంలో ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడుతున్నా.. ఏ రోజు ప్రభుత్వం వారి కష్టాలు తీర్చేందుకు ప్రయత్నించలేదు. అసలు ఉద్యోగులు అంటేనే జీతాల మీద బతికేవారు. వారికి ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఈఎంఐలు, చిట్టీలు, లోన్లు, పిల్లల స్కూల్, కాలేజీల ఫీజులు..ఇలా ఒకటేమిటి వారి కుటుంబ బండి సాగాలంటే కావాల్సింది పైసలే కదా. ఇక 15వ తారీఖు దాక జీతాలు పడలేదంటే వారు ఎన్ని ఇబ్బందులు పడతారో అర్థం చేసుకోవచ్చు. అప్పలు, చేబదళ్లు తీసుకుని ప్రతీ నెల తమ అవసరాలు తీర్చుకునేవారు. ఇలా ఉద్యోగుల్లో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిబింబించిందనే చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి నిరుద్యోగులు, ఉద్యోగులే ప్రధాన కారణమయ్యారు. ఇది బీఆర్ఎస్ ముఖ్యులే అంగీకరించారు.

ఇక కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళా విశేషమో.. ఈనెల జీతాలు 4వ తారీఖునే 30శాతం మంది ఉద్యోగులకు జీతాలు పడ్డాయట. ఇలా నెల మొదటివారంలోనే జీతాలు ఖాతాల్లో జమ కావడంతో ఉద్యోగులు నమ్మలేకపోతున్నారు. ఇది తమ జీవితాల్లో పెద్ద షాకింగ్ న్యూస్ అన్నట్టుగా వారి వారి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ మార్పు ద్వారా తమకు కలిగిన మొదటి ప్రయోజనం ఇది అని సంబరపడుతున్నారు. ఇక తమ మిగతా సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

TAGS