Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలోకి మరో 65 చికిత్సలను చేర్చుతున్నట్లు తెలిపింది. యాంజియోగ్రామ్, పార్కిన్సన్, వెన్నెముక సంబంధిత చికిత్సలను ఈ పథకం జాబితాలో చేర్చినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకు అవసరమైన రూ.497 కోట్ల 29 లక్షలను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,402 హాస్పిటల్స్ లో ఇప్పటి వరకు 1,672 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వైద్య నిపుణుల సూచనల మేరకు 1,375 చికిత్సలకు ప్యాకేజీల ధరను పెంచింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పూథకం కింద ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.10 లక్షల విలువ చేసే వైద్యాన్ని అందిస్తోంది. సుమారు 2.84 కోట్ల మంది లబ్ధి పొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై జూన్ 7న సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలు పెంచడంతో పాటు కొత్త చికిత్సలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.