Google Maps : తెలియని ప్రదేశానికి వెళ్తే గూగుల్ మ్యాప్ మనకు దారి చూపుతుందని తెలిసిందే కదా.. అయితే ఇదే గూగుల్ మ్యాప్ ప్రాణాలు పోయేందుకు కారణం అయ్యిందని తెలుసా? ఇటీవల ఈ ఘటన జరిగింది. గూగుల్ చేసిన తప్పుతో ముగ్గురు వ్యక్తలు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక వివాహానికి హాజరయ్యేందుకు వివేక్, అమిత్ ఇద్దరు గురుగ్రామ్ నుంచి బరేలీ బయల్దేరారు. తమకు దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ ను పెట్టుకున్నారు. అది చెప్పిన ప్రకారం వెళ్తుండగా అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి పై నుంచి వెళ్లాలని మ్యాప్స్ లో చూపించింది. వారు అలాగే వెళ్లారు. కారు బ్రిడ్జిపై నుంచి 50 అడుగుల ఎత్తు నుంచి నిస్సారమైన రామగంగ నదిలో పడిపోయింది. ఈ ఘటన రాత్రి జరిగింది.
మరుసటి రోజు ఉదయం ధ్వంసమైన కారును మరియు చనిపోయిన ముగ్గురు వ్యక్తులను సమీపంలోని గ్రామస్తులు గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మరణించిన వారిలో ఇద్దరి గురించి వివరాలు తెలియగా.. మూడో వ్యక్తి గురించి తెలియలేదు. బాధిత కుటుంబాలకు గూగుల్ తన సానుభూతి తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ‘మీ కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మేము అధికారులతో కలిసి పరిశోధిస్తున్నాము.’ అని గూగుల్ ప్రతినిధి తెలిపారు. అయితే బ్రడ్జి మొదట్లో, చివర్లో బారి కేడ్లు ఏర్పాటు చేయకపోవడంపై కుటుంబ సభ్యులు మందిపడ్డారు.