Google : ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశం భారత్. ఇక్కడ ఎన్నికలు అంటే ఆశామాషీ విషయం కాదు. అగ్రరాజ్యమైన అమెరికాతో సహా చాలా దేశాలు ఇక్కడి ఎన్నికల్లో కలుగజేసుకుంటాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటికి తోడు ఫలితాలు తారుమారయ్యే అనైతికమైన పద్ధతులను కూడా ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఈ సారి ఈ తరహా వార్తలను కట్టడి చేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్ రంగంలోకి దిగింది.
త్వరలో భారత్ లో జరగనున్న సార్వత్రిక (పార్లమెంట్) ఎన్నికలకు మద్ధతుగా గూగుల్ కొన్ని చర్యలు తీసుకోబోతోంది. ఓటర్లకు నాణ్యమైన సమాచారం చేరవేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. తన ప్లాట్ ఫాం దుర్వినియోగం నుంచి కాపాడడంతో పాటు AI ఆధారంగా యూజర్స్‌ను నావిగేట్ చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘానికి సహకరిస్తూనే ఓటు వినియోగంపై అవగాహన సమాచారాన్ని ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్తోంది.
ఇక, ప్రకటనలకు సంబంధించి కూడా నిబంధనలను తయారు చేసింది. ప్రకటన చేసుకోవాలని అనుకుంటే ధ్రువీకరణ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ అనుమతి పత్రం సమర్పించాలని స్పష్టం చేసింది. దీనికి చెల్లించే నగదు.. వారి వివరాలను తప్పనిసరి చేసింది. ఆయా అభ్యర్థులు చేసే అసత్య ప్రచారాలు, తప్పుడు క్లెయిమ్ లను అడ్డుకునేందుకు నిర్దిష్ట విధానాన్ని రూపొందించినట్లు చెప్తోంది.
‘మా విధానాలను ఉల్లంఘించే కంటెంట్ గుర్తించేందుకు మానవ ప్రమేయంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (AI) సాయం తీసుకోనున్నాం. ఫేక్ న్యూస్ ఆటకట్టించే మా ప్రయత్నాలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ మాడ్యూల్స్ మెరుగుపరుస్తాయి. భారత్ లోని అన్ని భాషల్లో కంటెంట్ ను రివ్యూ చేసేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల బృందం నిశితంగా పరిశీలింస్తుంది.’ అని గూగుల్ తెలిపింది.